అమరజవాను ప్రవీణ్ కుటుంబానికి రూ. 50 లక్షలు ప్రకటించిన సీఎం జగన్

అమరావతి: జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో అమరులైన నలుగురు జవాన్లలో ఏపీకి చెందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని విధాలుగా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామన్న ప్రభుత్వం.. సాయాన్ని ప్రకటించింది.

18 ఏళ్లుగా సైన్యంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి..

అమర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకాల ప్రవీణ్ కుమార్ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తుండగా.. శనివారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి అమరుడయ్యారు.

రూ. 50 లక్షలు ప్రకటించిన సీఎం వైఎస్ జగన్..

దేశం కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. వీరజవాను మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, అందువల్ల ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్య రజితకు సీఎం జగన్ లేఖ రాశారు.

మంత్రుల పరామర్శ.. ప్రవీణ్ తోపాటు తెలంగాణ జవాను కూడా

కాగా, ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రెడ్డివారిపల్లికి వెళ్లి ప్రవీణ్ కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రులు భరోసా కల్పించారు. ప్రవీణ్ కుమార్ వీరమరణం పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రవీణ్ ప్రాణాలర్పించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కాగా, ప్రవీణ్ తోపాటు తెలంగాణకు చెందిన మరో జవాన్ మహేశ్ కూడా అమరుడైన విషయం తెలిసిందే

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0