అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌- దమ్మాలపాటి పై ఏసీబీ కేసు…

2015-16 మధ్య అమరావతి రాజధాని ఏర్పాటు నేపథ్యంలో జరిగిన భూముల దందాపై ఏసీబీ ఇవాళ మరో కేసు నమోదు చేసింది. అయితే ఈసారి ఏకంగా మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ సహా మరో 12 మందిపై ఈ కేసు నమోదైంది. చంద్రబాబు హయాంలో ఏజీగా పనిచేసిన దమ్మాలపాటి తన హోదాను అడ్డుపెట్టుకుని అమరావతిలో భూముల స్కాంకు పాల్పడినట్లు ఏసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రకటనకు ముందే 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో అప్పటి ఏజీగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌ తన బంధువులు, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఏసీబీ తన కేసులో పేర్కొంది. అవే భూములను తిరిగి 2015-16 మధ్య కాలంలో తన పేరు మీద, తన భార్య పేరు మీద ఏజీ మార్చుకున్నట్లు ఏసీబీ తెలిపింది. ఈ భూములన్నీ కోర్‌ క్యాపిటల్‌లో కానీ సీఆర్డీయే పరిధిలోకి కానీ వస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది.

ఈ మేరకు ఏసీబీ డీజీకి ఫిర్యాదులు అందాయని, వీటి ఆధారంగా దమ్మాలపాటితో పాటు ఆయనకు ఈ వ్యవహారంలో సహకరించిన 12మందిపైనా కేసు నమోదు చేస్తున్నట్లు ఏసీబీ ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ భూముల వ్యవహారంలో ప్రభుత్వం తనపై చర్యలకు సిద్ధమవుతోందని ఆరోపిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన న్యాయస్ధానాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares