అమెరికా ఎన్నికలకు, గ్రహశకలానికి సంబంధం ఉందా?

అమెరికా అధ్యక్ష్య ఎన్నికలకు ఒక రోజు ముందు భూమిని ఒక గ్రహశకలం ఢీకొట్టే అవకాశం ఉందని స్పేస్ సైంటిస్ట్‌లు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్ష్య ఎన్నికలకు ఒక రోజు ముందు భూమిని ఒక గ్రహశకలం ఢీకొట్టే అవకాశం ఉందని స్పేస్ సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త(ఆస్ట్రోఫిజిస్ట్) నీల్ డి గ్రాస్సే టైసన్ ఆదివారం దీనికి సబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఆస్టరాయిడ్ రిఫ్రిజిరేటర్ పరిమాణంలో ఉంటుందని చెప్పారు. ఈ సైజులో ఉండే గ్రహశకలాలతో మన గ్రహానికి పెద్దగా ప్రమాదం ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ స్పేస్ రాక్ గంటకు 25,000 మైళ్లు లేదా గంటకు 40,233 కిలోమీటర్ల వేగంతో భూమి వైపునకు దూసుకు వస్తుంది. దీనికి ‘2018VPI’ అని పేరు పెట్టారు. నవంబర్ 2న ఇది భూవాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
టైసన్ ఏమంటున్నారు?
ఈ స్పేస్ రాక్ గమనాన్ని గ్రాస్సే టైసన్ విశ్లేషించారు. ‘అమెరికా అధ్యక్ష్య ఎన్నికలకు ఒక రోజు ముందే.. అంటే నవంబర్ 2న ఈ గ్రహశకలం భూమి మీదకు రావచ్చు. దీని గురించి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ చిన్న గ్రహశకలం మన గ్రహానికి నష్టం కలిగించేంత పెద్దది కాదు’ అని ఆయన వివరించారు. గ్రహశకలానికి సంబంధించిన ఫోటోను టైసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఒకవేళ ప్రపంచం ఈ సంవత్సరంతో అంతమైనా, దానికి విశ్వం కారణం కాదని ఆయన తెలిపారు. దీనిపై ఆయన ఇన్‌స్టా ఫాలోవర్లు కొంతమంది హాస్యాస్పదంగా స్పందించారు. “ఫ్రిజ్ భూమి వైపు పరుగెత్తుతోంది. అందులో డిన్నర్ కోసం ఏముందో..” అని ఒకరు, “ఇది ట్రంప్‌పై పడగలదా?” అని మరొకరు కామెంట్ పెట్టారు.
రెండేళ్ల క్రితమే కనుగొన్నారు
ఈ ఆస్టరాయిడ్ గురించి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రకటన విడుదల చేసింది. 2018VP1 గ్రహశకలాన్ని రెండేళ్ల క్రితమే కనున్నారు. ఇది అపోలో శ్రేణికి చెందిన గ్రహశకలం. ఇలాంటి స్పేస్ రాక్స్ భూమికి దగ్గరగా వస్తాయి. ఈ కుటుంబానికి చెందిన అంతరిక్ష వ్యర్థాలు విశ్వంలో చాలా ఉన్నాయి. VP1 ఆర్బిటాల్ పీరియడ్(కక్ష్య కాలం) రెండు సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది భూమికి దాదాపు 5,000 కిలోమీటర్ల వరకు రావచ్చని నాసా సైంటిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.
ప్రమాదం ఎందుకు లేదంటే…
ఈ స్పేస్రాక్తో పెద్దగా ప్రమాదం లేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఇది చాలా చిన్నది. నాసాకు చెందిన పొటెన్షియల్లీ హజార్డస్ స్పేస్ ఆబ్జెక్స్ట్ (భూమికి ప్రమాదంగా మారే అంతరిక్ష వ్యర్థాలు) ప్రకారం.. ఒక గ్రహశకలం 140 మీటర్లు లేదా 460 అడుగులు ఉంటేనే దానితో భూమికి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కానీ VP1 వెడల్పు సుమారు ఒక మీటర్ మాత్రమే. ప్రతి 240 గ్రహశకలాల్లో ఒకటి మాత్రమే భూమిపైకి వస్తుంది. ఇలాంటివి చాలా వరకు సురక్షితంగా కక్ష్యలో తిరుగుతాయి. ఒకవేళ భూవాతావరణంలోకి వచ్చినా, అది విచ్ఛిన్నమవుతుంది.