అశ్విన్ బౌలింగ్ ఆపేసి చూసిన ఆ చూపు..

మన్కడింగ్.. క్రికెట్లో ఆసక్తి రేకెత్తించే పదం ఇది. బౌలర్ బంతి వేయబోతుండగా.. బంతి రిలీజ్ కావడానికి ముందే నాన్‌స్ట్రైకర్ క్రీజును దాటి బయటికి వెళ్లిపోతే.. బౌలర్ రనౌట్ చేయొచ్చన్నది నిబంధన. ఇలా తొలిసారి ఓ బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసింది భారత క్రికెటర్ అయిన వినూ మన్కడ్. అందుకే దానికి ‘మన్కడింగ్’ అని పేరొచ్చింది. ఐతే ఇలా ఔట్ చేయడం నిబంధనల ప్రకారం సరైందే అయినప్పటికీ.. బ్యాట్స్‌మన్‌కు ఒకసారి వార్నింగ్ కూడా ఇవ్వకుండా నేరుగా ఔట్ చేసేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భావిస్తారు. ఐతే దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి.

ఐతే గత ఏడాదిన్నర కాలంగా ‘మన్కడింగ్’ అనే మాట ఎత్తితే అందరికీ గుర్తుకొస్తున్న పేరు రవిచంద్రన్ అశ్విన్‌దే. అతను ఈ తరహా ఔట్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. గత ఏఢాది పంజాబ్‌‌ కెప్టెన్‌గా ఉన్న అశ్విన్.. రాజస్థాన్ బ్యాట్స్‌మన్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం చర్చనీయాంశమైంది.

అశ్విన్ తన చర్యను సమర్థించుకోగా.. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ పలువురు అతణ్ని తప్పుబట్టారు. ఐతే ఎన్ని విమర్శలొచ్చినా అశ్విన్ మాత్రం తాను చేసింది కరెక్టే అంటూ వస్తున్నాడు. బంతి రిలీజ్ కాకముందే పరుగు తీయడం ద్వారా బ్యాట్స్‌మన్ పొందే అదనపు ప్రయోజనం మాటేంటి అన్నది అతడి ప్రశ్న. ఈసారి ఐపీఎల్ ముంగిట కూడా అతను మన్కడింగ్ గురించి మాట్లాడాడు.

ఐతే అంతగా తనను తాను సమర్థించుకున్న అశ్విన్.. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్ చేసే అవకాశం వచ్చినా చేయకుండా ఆగిపోవడం విశేషం. ప్రస్తుతం అతను ఢిల్లీకి ఆడుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్‌లో అతను బంతి వేయబోతుండగా ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ క్రీజు దాటి ముందుకెళ్లిపోయాడు. దీంతో బంతి వేయడం ఆపేసిన అశ్విన్.. ఫించ్ వైపు కోపంగా చూశాడు. అతను చూసే సమయానికి క్రీజు నుంచి మీటరు కంటే ఎక్కువ దూరంలోనే ఉన్నాడు ఫించ్. అశ్విన్ ఔట్ చేస్తే పెవిలియన్‌కు వెళ్లక తప్పని పరిస్థితి. కానీ అతనా పని చేయలేదు. ఆ సమయంలో అశ్విన్ చూపు చూస్తే.. మన్కడింగ్‌ను వ్యతిరేకించే వాళ్లందరూ దీనికేమని బదులిస్తారు అన్నట్లుగా కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares