అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా!

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ (71) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత నెల ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అనంతరం పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయన గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఇతర కీలక అవయవాలపై కూడా ఆ ప్రభావం పడిందని వైద్యులు పేర్కొన్నారు. అహ్మద్ పటేల్‌కు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగానే కాకుండా, సోనియాగాంధీకి వ్యక్తిగత సలహాదారుగా, అత్యంత నమ్మకస్థుడైన నేతగా పేరుంది. కాగా, తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని, ఆయన త్వరగా కోలుకునేలా ప్రార్ధిస్తున్నానని అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ పటేల్ ట్వీట్ చేశారు.