ఆర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఓ ఇంటీరియల్ డిజైనర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విషయంలో హైకోర్టు వ్యవహరించిన తీరు సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో హైకోర్టు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని పేర్కొంది. ఈ కేసు అంశంలో జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఛానల్ చూడొద్దని అనిపిస్తే చూడకూడదని… తాను కూడా ఆయన ఛానల్ చూడనని అన్నారు. అయితే వ్యక్తిగత స్వేచ్ఛ అంశం భిన్నమైనదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని మహారాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.
ఇలా చేస్తే సుప్రీంకోర్టు ఉందనే విషయాన్ని ఈ తీర్పు ద్వారా పంపిస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. అంతకుముందు ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్పై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ఓ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆర్నబ్ గోస్వామితో పాటు ఫెరోజ్ షేక్, నితీష్ సర్దాలను నవంబర్ 4న మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. నవంబర్ 9న బాంబే హైకోర్టు గోస్వామికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ లభించింది.