ఆ ఫ్లాప్ షోకి నిర్మాత, దర్శకుడు మొత్తం చంద్రబాబే: బొత్స


చంద్రబాబును ఏపీ టూరిస్టు కింద పిలిస్తే బాగుంటుందని బొత్స ఎద్దేవా చేశారు. ఎందుకంటే, సొంత ఇల్లు ఇక్కడే ఉండి, గత ఆరు నెలలుగా 15 రోజులు కూడా ఈ రాష్ట్రంలో నివాసం ఉండని వ్యక్తిని టూరిస్టుగానే భావించాల్సి ఉంటుందన్నారు.

అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు, టీడీపీ నాయకులు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని, అది కూడా అక్కడక్కడా ఒకటి, రెండు గ్రామాల్లో చేస్తున్న పోరాటం, నిరసనలు చూస్తుంటే.. ఫ్లాప్ అయిన సినిమాకు, ప్రేక్షకులే లేని సినిమాకు.. అహో అద్భుతం అంటూ వారికివారే డప్పులు కొట్టుకుని వంద రోజులు, రెండొందలు రోజులు, మూడొందలు రోజులు ఫంక్షన్ లు చేసినట్టు ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, టీడీపీ పిలుపునకు ప్రజలు ఏ ప్రాంతంలో అయినా, ఎక్కడైనా కూడా స్పందించలేదన్నారు. ‘చంద్రబాబు.. ఒక ప్లాప్ షోకి నిర్మాత, దర్శకుడు. ప్రేక్షకులు లేని థియేటర్ లో 300 రోజులు సినిమా ఆడించానని పండుగ చేసుకుంటున్నాడు. అమరావతిలో ఉద్యమమే లేదు. ఉద్యమం చేయాల్సినంత కారణమూ లేదు. కాబట్టే, నలుగురిని పెట్టుకుని రౌండ్ టేబుల్ అంటాడు. పది మందిని పెట్టుకుని 5 నిమిషాల సేపు కెమెరాలు ఉన్నంతవరకూ నిరసన అంటాడు. 29 గ్రామాలు కాస్తా 3 గ్రామాలయ్యాయి. 3 గ్రామాల కాస్తా.. 30 మందికి పరిమితమయ్యాయి. ఆ 30 మంది రైతులా.. లేక బాబు మద్దతుదారులా.. అన్నది అందరికీ తెలుసు.’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.

విశాఖలో జరిగిన ల్యాండ్ స్కాంల పై ఇప్పటికే సిట్ విచారణ జరుపుతుందని బొత్స తెలిపారు. గత ప్రభుత్వం సిట్ విచారణను మూలన పెడితే.. ఈ ప్రభుత్వం వచ్చాక, నిర్దిష్ట సమయం ఇచ్చి విచారణ పూర్తి చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారని బొత్స తెలిపారు. సిట్ కాల పరిమితి ఇక పెంచకుండా దర్యాప్తు పూర్తి చేయాలని చెప్పారన్నారు. ‘మేం ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టే, ధైర్యంగా ఉన్నాం. విచారణ జరిపిస్తున్నాం. తెలుగుదేశం హయాంలో ఎప్పుడైనా ఏ దర్యాప్తు అయినా పూర్తి చేశారా? దోషులపై చర్యలు తీసుకున్నారా? నాడు ప్రతిదీ ప్రతిపక్షంగా ఉన్న వైసీపీపై ఆరోపణలు మోపి.. దర్యాప్తులు వేసి, చివరికి వాళ్ళే దోషులుగా తేలేటప్పటికీ విచారణలు నిలిపివేశారు.’ అని బొత్స అన్నారు.

చంద్రబాబును ఏపీ టూరిస్టు కింద పిలిస్తే బాగుంటుందని బొత్స ఎద్దేవా చేశారు. ఎందుకంటే, సొంత ఇల్లు ఇక్కడే ఉండి, గత ఆరు నెలలుగా 15 రోజులు కూడా ఈ రాష్ట్రంలో నివాసం ఉండని వ్యక్తిని టూరిస్టుగానే భావించాల్సి ఉంటుందన్నారు. ‘అమరావతిలో రాజధాని ఉంటుంది. విశాఖ, కర్నూలు కూడా రాజధానులు కాబోతున్నాయి. చంద్రబాబు చేస్తున్న ఉద్యమం అమరావతి రాజధాని కావాలని కాదు. విశాఖ, కర్నూలు రాజధాని కాకూడదని ఉద్యమం చేస్తున్నారు. అంటే ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవం మీద, రాయలసీమ ఆత్మగౌరవం మీద తన బినామీ భూముల రేట్ల కోసం, ఒక టీవీ కెమెరా ఉద్యమాన్ని నడుపుతున్నారు.’ అని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖ నగర అభివృద్ధి కోసం అన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నామని బొత్స తెలిపారు. విశాఖపట్నంలో కొత్తగా నిర్మించాల్సిన ప్రాజెక్టులను పరిశీలిస్తున్నామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించి ఓ ఏజెన్సీకి 2500 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో అప్పగించాలని చూస్తే.. అందులో 500 ఎకరాలు తగ్గించి, ఆ భూముల్లో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు పెంచాలని ఈ ప్రభుత్వం చూస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares