ఇంటికి చేరుకున్న హేమంత్ మృతదేహం… కాసేపట్లో అంత్యక్రియలు…


హైదరాబాద్‌లో పరువుహత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. హేమంత్ మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి నుంచి చందానగర్‌లోని ఆయన ఇంటికి చేరుకుంది. దహన సంస్కారాలు త్వరగా పూర్తి చేయాలని పోలీసులు చెప్పడంతో మధ్యాహ్నం వరకు అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు హేమంత్ హత్యపై ఇటు మీడియాలో,అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.కులాంతర వివాహాలు చేసుకున్నవాళ్లను బలితీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వేర్వేరు కులాలు…
హత్యకు గురైన హేమంత్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన యువకుడు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అవంతిని ఈ ఏడాది జూన్ 10న ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆ కూతురు కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆమె కుటుంబ సభ్యులు ఎలాగైనా ఇద్దరిని విడదీయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో అవంతి మేనమామ యుగేందర్ రెడ్డితో కలిసి తండ్రి లక్ష్మారెడ్డి హత్యకు స్కెచ్ వేశాడు. హేమంత్ హత్యకు రూ.10లక్షలకు కిరాయి మనుషులతో డీల్ కుదుర్చుకున్నాడు.

నమ్మించి తీసుకెళ్లి…
అవంతి ఫ్యామిలీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండటం… తరుచూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో… హేమంత్-అవంతి చందానగర్‌లో కాకుండా గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో అద్దెకు ఉంటున్నారు.

ప్లాన్‌లో భాగంగా గురువారం(సెప్టెంబర్ 24) ఉదయం తమ ఇంట్లో పనిచేసే సాహెబ్ అనే డ్రైవర్‌ను పంపించి వాళ్లు ఇంట్లో ఉన్నారో లేరో తెలుసుకోవడానికి రెక్కీ నిర్వహించారు. అనంతరం లక్ష్మారెడ్డి ఫ్యామిలీ వారి ఇంటికెళ్లారు. మాట్లాడుకుందామని నమ్మించి ఇద్దరినీ కారులో ఎక్కించుకున్నారు. కానీ మార్గమధ్యలో వాహనాన్ని మరో రూట్ వైపు మళ్లించడంతో ఇద్దరూ కిందకు దూకేశారు. ఆ వెంటనే కిరాయి మనుషులు హేమంత్ పారిపోకుండా పట్టుకుని బలవంతంగా కారులో ఎక్కించారు. అవంతి పారిపోవడంతో వారి నుంచి తప్పించుకుంది.

తాడుతో గొంతు నులిమి హత్య
ఆ తర్వాత కారులో ఓఆర్ఆర్ మీదుగా జహీరాబాద్ వైపు వెళ్లారు. అక్కడినుంచి సంగారెడ్డికి తీసుకెళ్లి హేమంత్‌ కాళ్లు,చేతులు కట్టేసి హత్య చేశారు. అతని ముఖంపై పిడి గుద్దులు కురిపించడంతో పాటు తాడుతో గొంతు నులిమి హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం రోడ్డు పక్కన పొదల్లో పడేసి వెళ్లిపోయారు. శుక్రవారం(సెప్టెంబర్ 25) ఉదయం పోలీసులు ఆ మృతదేహాన్ని గుర్తించడం… అది హేమంత్‌దే అని నిర్దారించడంతో పరువు హత్య వ్యవహారం వెలుగుచూసింది. హేమంత్ హత్యతో అతని భార్య అవంతి,తల్లిదండ్రులు లక్ష్మి,మురళీకృష్ణ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ 14 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares