ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌‌ షెడ్యూల్ ఖరారు.. ప్రకటించిన ఆసీస్ బోర్డ్

న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా ప్లేయర్లు ఆస్ట్రేలియా టూర్‌‌కు వెళ్లనున్నారు. ఈ సిరీస్‌‌లో పాల్గొనబోయే ప్లేయర్ల వివరాలను ఈమధ్యే బీసీసీఐ ప్రకటించింది. తాజాగా ఈ టూర్ షెడ్యూల్‌‌ను క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు జరగనున్నాయి. నవంబర్ 27న మొదలవనున్న ఈ సిరీస్.. వచ్చే ఏడాది జనవరి 19న ముగియనుంది. నవంబర్ 12న సపోర్ట్ స్టాఫ్‌‌తో కలసి టీమిండియా జట్టు ప్లేయర్లు సిడ్నీకి చేరుకొని, అక్కడే క్వారంటైన్‌‌లో ఉండనున్నారు.

రెండు నెలల భారీ టూర్‌‌లో తొలి రెండు వన్డేలు సిడ్నీలో జరగనుండగా.. చివరి వన్డే, తొలి టీ20 (డిసెంబర్ 2, 4వ తేదీలు) కానెబెర్రాలోని మనూకా ఓవల్ మైదానంలో నిర్వహించనున్నారు. ఆఖరి రెండు టీ20లు (డిసెంబర్ 6,8) సిడ్నీలో జరగనున్నాయి. ఆ తర్వాత జరిగే బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ఫస్ట్ మ్యాచ్‌‌కు అడిలైడ్‌‌లోని ఓవల్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. డే అండ్ నైట్ గేమ్‌‌గా జరగనున్న ఈ పోరులో పింక్ బాల్స్‌‌ను వినియోగించనున్నారు. మెల్‌‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌‌లో (డిసెంబర్ 26న) రెండో మ్యాచ్‌‌ను బాక్సింగ్ డే టెస్టు స్లాట్‌‌లో ప్లాన్ చేశారు. మూడో టెస్టు జనవరి 7న ఎస్‌‌సీజీలో.. నాలుగో మ్యాచ్ బ్రిస్బేన్‌‌లోని గబ్బాలో జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares