‘ఇస్లాం వివాదం’లో ఫ్రాన్స్‌కు భారత్ ఎందుకు మద్దతు ఇస్తోంది?

భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది ఆగస్టులో ఫ్రాన్స్‌లో పర్యటించారు. అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి ఆయన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370ని భారత రద్దు చేయడం గురించి మేక్రాన్‌ను అప్పుడు ఓ జర్నలిస్టు ప్రశ్న అడిగారు.

”నియంత్రణ రేఖకు రెండు వైపులా ఉన్న సాధారణ పౌరుల హక్కుల విస్మరణకు గురవ్వకూడదన్న విషయాన్ని ఫ్రాన్స్ పరిశీలిస్తోంది” అని మేక్రాన్ దానికి బదులిచ్చారు.

ఈ విషయమై ప్రధాని మోదీతోనూ తాను మాట్లాడానని… భారత్, పాకిస్తాన్ రెండూ ఈ బాధ్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

భారత్, పాక్ తమ మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని, పాక్‌కు కూడా తాము ఇదే సూచిస్తామని మేక్రాన్ చెప్పారు.

అంటే, ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఆయన బహిరంగంగా భారత్‌కు మద్దతు తెలిపేందుకు ముందుకు రాలేదు.

అయితే, తాజాగా ఫ్రాన్స్‌లో ఇస్లాం విషయమై వివాదం రేగుతోంది. ఈ వ్యవహారంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌ను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ గట్టిగా సమర్థించింది.

”ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌పై అభ్యంతరకర భాషలో జరుగుతున్న వ్యక్తిగత దాడులను మేం ఖండిస్తున్నాం. ఫ్రాన్స్‌లో తీవ్రవాద దాడి చేసి టీచర్ ప్రాణాలు తీయడాన్ని కూడా మేం ఖండిస్తున్నాం. ఆ టీచర్ కుటుంబానికి, ఫ్రాన్స్ ప్రజలకు సానూభూతి తెలియజేస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తీవ్రవాదాన్ని సమర్థించడం సరికాదు” అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

భారత్ కన్నా ముందు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ లాంటి యురోపియన్ దేశాలు కూడా ఫ్రాన్స్‌కు ఈ విషయంలో మద్దతు ప్రకటించాయి.

గురువారం ఫ్రాన్స్‌లోని నీస్ పట్టణంలో ఓ ఆగంతకుడు ముగ్గురిని హత్య చేశాడు. ఈ హత్యలను ఖండిస్తూ భారత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అమెరికా, బ్రిటన్, రష్యా లాంటి దేశాలు కూడా ఆ తర్వాత స్పందించాయి.

రెండు దేశాల సంబంధాలు
భారత్, ఫ్రాన్స్‌ల మధ్య గట్టి స్నేహ బంధం ఉందని, సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయం రుజువైందని ఇదివరకు ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా పనిచేసిన రాకేశ్ సూద్ అన్నారు.

”ఫ్రాన్స్‌ లౌకికవాదానికి తమదైన నిర్వచనం ఇచ్చుకుంది. ఆ దేశంలో 80 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ, తాము అనుకున్న లౌకికవాదాన్ని ఆ దేశం కచ్చితంగా అమలు చేస్తోంది. హిజాబ్‌ను నిషేధించిన చోట క్రైస్తవుల క్రాస్‌ను కూడా ఆ దేశం నిషేధిస్తుంది. భారత్‌లో మాత్రం పరిస్థితి భిన్నం” అని ఆయన అన్నారు.

అయితే, మానవహక్కుల అంశం గురించి ఫ్రాన్స్ మాట్లాడటాన్ని, భారత్‌తో స్నేహం లేకపోవడం అని అనుకోకూడదని రాకేశ్ సూద్ అన్నారు.

ఫ్రాన్స్, భారత్‌ల మధ్య రాజకీయంగా, ఆర్థికంగా మంచి సంబంధాలు ఉన్నాయని బాయ్లోట్ కూడా అన్నారు.

1998లో అణు పరీక్షలు నిర్వహించినప్పుడు చాలా దేశాలు భారత్ నుంచి దూరం జరిగినా, ఫ్రాన్స్ మద్దతుగా ఉందని రాకేశ్ సూద్ చెప్పారు. భారత్‌పై అప్పుడు అంతర్జాతీయంగా ఆంక్షలు అమలైనా, సంక్షోభ సమయంలో ఫ్రాన్స్ అండగా ఉందని అన్నారు.

”1982లో తారాపుర్ న్యూక్లియర్ ప్లాంట్‌కు అమెరికా యురేనియం సరఫరా నిలిపివేసినప్పుడు రష్యా కూడా మనకు సాయం చేయలేదు. ఫ్రాన్స్ అప్పుడు సాయపడింది” అని చెప్పారు.

అంతరిక్ష కార్యక్రమాల్లోనూ ఫ్రాన్స్, భారత్‌కు భాగస్వామిగా ఉందని రాకేశ్ చెప్పారు. జలాంతర్గామిల తయారీలోనూ సాయం చేస్తోందని, ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని మొదటగా చెప్పిన దేశం ఫ్రాన్సేనని అన్నారు.

రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి వస్తున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0