ఈ ఐపీఎల్‌లో నిన్నెంతో మిస్సయ్యాం రైన: సెహ్వాగ్

క్రికెట్ చరిత్రలో అత్యంత విధ్వంకరమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. ఔట్ అవుతాననే భయం లేకుండా.. మొదటి బంతి నుంచే బౌండరీలు బాదుతూ బౌలర్లపై విరుచుకుపడేవాడు. ఇంకో రన్ కొడితే సెంచురీ పూర్తి అవుతుందన్న సమయంలో చాలా మంది బ్యాట్స్‌మెన్ సింగల్ కోసం ప్రయత్నిస్తారు. కానీ వీరు మాత్రం అలా కాదు. బౌండరీ, సిక్స్ బాదేవాడు. ఇక టీ20 అయినా వన్డే అయినా టెస్టు అయినా ఒకేలా ఆడుతాడు సెహ్వాగ్. అలాంటి డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా వీరూకు క్రికెటర్లు, ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ తదితర క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సెహ్వాగ్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న రైనా.. వీరూకు ప్రత్యేకంగా విష్ చేశాడు.

‘హ్యాపీ బర్త్ డే వీరూ బాయ్. నాకు పెద్ద అన్నయ్య. నాలో ఎప్పుడూ స్ఫూర్తి నింపడంతో పాటు జీవితంలో మార్గదర్శిగా నిలిచావు. నీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ రోజు నీకు అద్భుతంగా గడవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని సురేష్ రైనా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. దీనికి వీరూ స్పందిస్తూ.. ‘శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు సురేశ్. ఈ ఐపీఎల్‌లో నిన్నెంతో మిస్సయ్యాం. నువ్వు త్వరగా తిరిగొస్తావని ఆశిస్తున్నా. బెస్ట్ విషెష్’ అని పేర్కొన్నాడు.

‘సిక్సర్లు, ఫోర్లతో మాత్రమే డీల్ చేసే వీరేంద్ర సెహ్వాగ్.. 42వ ఏట అడుగుపెడుతున్నాడు. ఇది కూడా 6 వస్తుంది. వందేళ్లు చల్లగా జీవించు. జన్మదిన శుభాకాంక్షలు సెహ్వాగ్’ అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. ‘థ్యాంక్యూ గాడ్ జీ.. మీరు సెంచరీలతో డీల్ చేస్తారు. క్రికెట్‌కు మీరు చేసిన సేవల్ని వర్ణించడానికి అంకెలు సరిపోవు. స్ఫూర్తిగా నిలిచినందుకు, శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు’ అని వీరేంద్రుడు స్పందించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వీరూ 104 టెస్టుల్లో, 251 వన్డేల్లో, 19 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0