ఎస్పీ బాలు అంత్యక్రియల్లో మంత్రి అనిల్… ఏపీ ప్రభుత్వం తరపున నివాళి


గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. శనివారం(సెప్టెంబర్ 25) ఉదయం 10.30గంటలకు జరగనున్న బాలు అంత్యక్రియల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున మంత్రి అనిల్ కుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు పాల్గొననున్నారు.

బాలు భౌతిక కాయాన్ని ఉంచిన ఫామ్ హౌస్‌కు ఇప్పటికే వైసీపీ నేతలు చేరుకున్నారు. అక్కడ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ… బాలసుబ్రహ్మణ్యం లేని లోటు తీర్చలేనిదని అభిప్రాయపడ్డారు. ఆయన నెల్లూరు వాసి కావడం నెల్లూరు వ్యక్తిగా గర్వపడుతున్నానని చెప్పారు. నెల్లూరులో ఆ గాన గంధర్వుడి జ్ఞాపకార్థం మెమోరియల్ ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతానని చెప్పారు.

అన్ని భాషలలో అన్నివేల పాటలు పాడిన వ్యక్తి మరొకరు లేరని… ఇక ఉండబోరని మంత్రి అనిల్ అన్నారు. బాలు మృతికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారని… ఆయన తరుపున తాము నివాళి అర్పించామని తెలిపారు.

కాగా,శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు క‌రోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆగ‌స్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేట‌ర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయ‌న గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డంలో తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. శుక్రవారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. ఆయన మృతి ప‌ట్ల‌ ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. దేశవ్యాప్తంగా సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఆయనకు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares