ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: కొత్త ఇసుక విధానం, ‘జగనన్న చేదోడు’కు ఆమోదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుంది. గురువారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఒకే సంస్థకు ఇసుక రీచ్‌లు

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్‌లను ఒకే సంస్థకు, అదీ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థకు అప్పగించాలని సర్కారు నిర్ణయించింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు రాకపోతే బహిరంగ వేలం వేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. భూముల రీసర్వే ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపింది.

అగ్నిమాపక శాఖలో నాలుగు జోన్లు

ఇది ఇలావుంటే, అగ్నిమాపక శాఖలో నాలుగు జోన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు రెండో జోన్లుగా ఉన్న అగ్నిమాపక, విపత్తు, నిర్వహణ శాఖలను సౌలభ్యం కోసం 4 జోన్లుగా విభజన చేయాలని నిర్ణయించింది. కొన్ని జైలు సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి కూడా మంత్రివర్గ ఆమోదించింది. ఆదోనీలోని 2 వర్గాల ఘర్షణ కేసులను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. జగనన్న చేదోడుకు ఆమోదం

మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో రూ. 5853 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది. ఇక చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి ఆమోదం తెలిపింది. మంత్రివర్గ భేటీ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఈ మేరకు వెల్లడించారు. విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాలు భూమి కేటాయింపునకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ అంశంపై కేబినెట్ కమిటీ నివేదికపై ఈ సందర్భంగా చర్చించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares