కరోనా సోకిన ట్రంప్‌తో డిబేట్‌కు బిడెన్ నో….

అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో అధ్యక్షుడు , రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్ కరోనా బారిన పడటం, ఇప్పటికీ ఆయనకు కరోనా తగ్గలేదన్న ప్రచారం సాగుతుండటంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్‌తో ఇప్పటికే ఓ సారి అధ్యక్ష ఎన్నికల డిబేట్లో\పాల్గొన్న డెమోక్రాట్ అభ్యర్ధి బిడెన్ మరోసారి మాత్రం డిబేట్ వద్దంటున్నారు.
ట్రంప్‌కు కరోనా సోకడం, ఆయన నుంచి వైట్‌హౌస్‌లో మరికొందరికి సోకిందన్న వార్తలు రావడంతో అధ్యక్ష ఎన్నికల్లో ఆయనతో పోటీపడుతున్న డెమోక్రాట్ అభ్యర్ధి జో బిడెన్ అప్రమత్తమయ్యారు. ఈ నెల 15న అధ్యక్ష ఎన్నికల రెండో డిబేట్ జరగాల్సి ఉండగా.. ట్రంప్‌కు కరోనా తగ్గకపోతే ఈ డిబేట్ నిర్వహించకపోవడమే మంచిదని బిడెన్ అన్నారు. మియామీలో జరగాల్సిన ఈ డిబేట్‌కు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బిడెన్ అభిప్రాయపడ్డారు. పెన్సిల్వేనియాలో తాజాగా మీడియాతో మాట్లాడిన బిడెన్ ట్రంప్‌కు కరోనా తగ్గకపోతే ఈ డిబేట్ నిర్వహించడం మంచిది కాదన్నారు.
ట్రంప్ తాజా పరిస్ధితి ఏంటో తనకూ తెలియదని, అయితే ఆయన ఫిట్‌గా ఉంటే మాత్రం డిబేట్‌కు తాను సిద్ధమని, అన్ని జాగ్రత్తలు తీసుకుని డిబేట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని బిడెన్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బిడెన్ ప్రచార ప్రతినిధి టిమ్ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ రెండో డిబేట్ కల్లా కచ్చితంగా కోలుకుని పాల్గొంటారన్నారు. ఈ విషయంలో బిడెన్ అంచనాలేవీ నిజం కాబోవన్నారు.
మరోవైపు ట్రంప్‌కు కరోనా కచ్చితంగా తగ్గిందా లేదా అన్న దానిపై నిర్ధిష్ట సమాచారం లేకపోవడంతో రిపబ్లికన్ పార్టీ వర్గాలతో పాటు డెమోక్రాట్లలోనూ ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ కరోనా వ్యవహారం ఎన్నికలను ఏ మలుపు తిప్పుతుందో అన్న ఆందోళన ఇరు పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది.