కార్తీక సోమవారం విశిష్టత ఏమిటి?


పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన వారం. సోమ .. అంటే, స – ఉమ అనే అర్థం ఆవిష్కరించబడుతోంది. స- ఉమ అంటే ఉమతో కూడినవాడుగా శివుడు చెప్పబడుతున్నాడు. ఈ కారణంగానే సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని అంటారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలోని సోమవారాలు మరింత విశేషాన్ని కలిగినవిగా కనిపిస్తుంటాయి.
ఈ వారంలో ముత్తయిదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగల్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి, పూజా మందిరాన్ని అలంకరించాలి. భక్తిశ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి, బిల్వ దళాలతో అర్చించాలి.

శివుడిని బిల్వ దళాలతో పూజించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టంచేయబడుతోంది. ఈ రోజున శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాన్ని వెలిగించాలి.

ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించడం వలన సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుడిని ఆరాధించడం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందడం జరుగుతుంది. ఆదిదేవుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు, కార్తీకమాసంలో చివరి సోమవారాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. ఆ రోజంతా సదాశివుడి సేవలో తరించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares