కూచిపూడి నర్తకి శోభా నాయుడు మృతి

ప్రముఖ కూచిపూడి నర్తకి శోభా నాయుడు హైదరాబాద్‌లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించారు. పద్మావతి పాత్రలో ఆమె కనిపించే శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం నాట్య ప్రియులకు అత్యంత ప్రీతి పాత్రమైనది.

అలాగే, శ్రీ కృష్ణ పారిజాతంలో సత్యభామ పాత్ర కూడా ఆమె నటించిన పాత్రలలో బాగా పేరు సంపాదించుకున్నారు. ఆమెకు దేశవిదేశాలలో శిష్యులున్నారు. ఆమె కూచిపూడి నృత్య ప్రతిభకు గాను భారత ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారం ప్రదానం చేసింది.

ఆమె వెంపటి చిన సత్యం దగ్గర నృత్యం అభ్యసించారు. హైదరాబాద్ లో కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్థాపించి పలువురు నృత్య కళాకారులకు శిక్షణ ఇచ్చేవారు. శోభానాయుడు అనగానే భామా కలాపం, శ్రీనివాస కళ్యాణం గుర్తు వస్తాయని ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగసూరి వేణు గోపాల్ అన్నారు.

ఆమె ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం అడ్వైజరీ కమిటీ సభ్యురాలిగా ఉండేవారని చెప్పారు. ఆమె డాన్సర్ మాత్రమే కాకుండా నృత్యంలో ఆమె పరిశోధకురాలు కూడా అని అన్నారు. ఆమెలో ఇసుమంత కూడా గర్వం కనిపించదని శోభా నాయుడుతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆల్ ఇండియా రేడియో కోసం అన్నమయ్య పద గోపురం అని కార్యక్రమం చేసినట్లు చెప్పారు. “కృష్ణను కలవడానికి సత్యభామ వెళ్లినట్లున్నారు” అని ఆమె స్నేహితురాలు దీపిక రెడ్డి బీబీసీ తెలుగుతో అన్నారు.

ఆమె జీవితాన్ని నృత్యానికే అంకితం చేసారని ఆమె అన్నారు. వారు తమ కళ ద్వారా ప్రజల మనసులలో ఎప్పటికీ నిలిచి ఉండిపోతారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares