కెసిఆర్‌ ఫాం హౌస్‌ నుంచి బయటకు రావాలి : అమిత్‌ షా


హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో.. ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షో అనంతరం అమిత్‌ షా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రోడ్‌ షోలో స్వాగతం పలికిన హైదరాబాద్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీట్లు పెంచుకోవడానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, మేయర్‌ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామన్నారు. బిజెపి అభ్యర్థే మేయర్‌ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటి హబ్‌గా మారుస్తామని చెప్పారు. ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టిఆర్‌ఎస్‌ నడుస్తోందని విమర్శించారు. బిజెపి కి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తోందని, సిటీలో వరదలు వచ్చినప్పుడు కెసిఆర్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కెసిఆర్‌ ఎవరితోనూ సమావేశం కాలేదని ఆరోపించారు. తన ప్రశ్నలకు కెసిఆర్‌ సమాధానాలు చెప్పాలని, ఫాం హౌస్‌ నుంచి బయటకు రావాలని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు.
” గత ఎన్నికల తర్వాత వంద రోజుల ప్రణాళిక అన్నారు.. ఏమైంది ? లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది ? ఇచ్చిన హామీలను టిఆర్‌ఎస్‌ నెరవేర్చలేకపోయింది. హుస్సేన్‌ సాగర్‌ను శుద్ధి చేస్తాం.. పర్యాటక కేంద్రంగా మారుస్తాం అన్నారు. ఏమయ్యాయి అవి. ప్రజలకు ఆయుష్మాన్‌ భారత్‌ ఫలాలు అందకుండా అడ్డుకున్నారు ” అంటూ అమిత్‌ షా కెసిఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈరోజు ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్‌ షా తెలంగాణ ప్రజలనుద్దేశించి తెలుగులో ట్వీట్‌ చేస్తూ.. ” హైదరాబాద్‌ చేరుకున్నాను. తెలంగాణ ప్రజల ఆప్యాయతకు మరియు మద్దతుకు ముగ్దుడనైయ్యాను. ” అని పేర్కొన్నారు.
అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రోడ్‌ షో లో పాల్గొని బిజెపి తరపున ప్రచారాన్ని చేపట్టారు. అమిత్‌ షా మరోసారి తెలుగులో ట్వీట్‌ చేస్తూ.. ” హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకొని, అమ్మ ఆశీస్సులు అందుకున్నాను. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించాను. భాగ్యలక్ష్మి అమ్మవారు, దేశ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని నమ్ముతున్నాను. ” అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares