కోల్‌కతాను కంగుతినిపించిన ముంబై.. టాప్ ప్లేస్‌లో రోహిత్ సేన

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. నిన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 19 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ఐపీఎల్‌లో ముంబైకి ఇది వరుసగా ఐదో విజయం. ఈ గెలుపుతో 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.

కోల్‌కతా తమ ముందుంచిన 149 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకునేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై తొలి బంతి నుంచే దూకుడు మొదలుపెట్టింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ క్వింటన్ డికాక్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 35 పరుగులు చేసిన రోహిత్ శివం మావి బౌలింగ్‌లో వికెట్ల వెనక దొరికిపోయాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా, డికాక్‌లు కలిసి వీర విహారం చేసి జట్టుకు విజయాన్ని అందించారు. డికాక్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 పరుగులు చేయగా, పాండ్యా 11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 21 పరుగులు చేశాడు. ఫలితంగా మరో 19 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ త్రిపాఠి (7), నితీశ్ రాణా (5), దినేశ్ కార్తీక్ (4), రస్సెల్ (12) విఫలం కాగా, ఈ మ్యాచ్‌తో కెప్టెన్సీ బాధ్యతను తలకెత్తుకున్న మోర్గాన్ జాగ్రత్తగా ఆడుతూ పరుగులు జోడించే ప్రయత్నం చేశాడు. మరోవైపు, చివర్లో కమిన్స్ చెలరేగడంతో కోల్‌కతా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

29 బంతులు ఎదుర్కొన్న మోర్గాన్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, చివర్లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన క్వింటన్ డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 33వ మ్యాచ్ జరగనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares