చంద్రబాబుకు భారీ ఊరట- జగన్‌ సర్కారుకు మరో షాక్‌- సిట్‌ విచారణకు హైకోర్టు నో…


ఏపీలో జగన్ సర్కారుకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాల్లో అవినీతి ఉందంటూ సిట్‌ దర్యాప్తుకు ఆదేశించిన వైసీపీ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పలేదు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులివ్వగా.. తాజాగా ఈ జాబితాలో మరో కేసు చేరింది.

గతేడాది వైసీపీ అధికారంలోకి రాగానే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీతో విచారణ నిర్వహించింది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది. రాజధాని భూములతో పాటు గత ప్రభుత్వంలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో అవినీతిపై సిట్‌ దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. దీన్ని సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్లరామయ్య, ఆలపాటి రాజా హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయాలను ఇలా తర్వాత వచ్చే ప్రభుత్వాలు ప్రశ్నిస్తూ పోతే ఇక పాలన సాగేదెలా అంటూ తమ పిటిషన్లలో ప్రశ్నించారు.

గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్‌ ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. ఇవాళ స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు ధర్మాసనం సిట్‌ దర్యాప్తును నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తుది తీర్పు ఆధారంగా సిట్‌ దర్యాప్తు కొనసాగించాల్సి ఉంటుందని హైకోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares