చంద్రబాబు ఇంటికి వరద ముప్పు నోటీసు… ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు

విజయవాడలోని ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్నారు. ఈ ఇంటికి వరద ముప్పుపొంచివుందని పేర్కొంటూ ఇంటికి వరద ముప్పు నోటీసును అంటించారు. అలాగే, మరో 35 భవనాలకు అధికారులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. వరద ముంపు నేపథ్యంలోనే అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు.

ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గంటగంటకు కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో తూర్పు, పశ్చిన కాలువలకు 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరుకోగా, ఇన్‌ఫ్లో 6.66 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులు ఉంది.

ఫలితంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్‌లో ఇళ్లు నీటమునిగాయి. దీంతో విజయవాడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంత బాధితులను తరలిస్తున్నారు. కంట్రోల్ రూము ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మరోవైపు, నిన్న మొన్నటి వరకూ 3 లక్షల క్యూసెక్కుల వరకూ ఉన్న కృష్ణానది వరద, ఒక్కసారిగా 6 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అమలు చేస్తున్నామని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు వెల్లడించారు.

సోమవారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,65,925 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలోని కృష్ణలంకలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. నది వెంబడి ఉన్న గ్రామాలు, లంకల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares