చైనాతో భారత్‌కు పెద్ద తలనొప్పి.. శీతలయుద్ధానికి భారత ఆర్మీ సిద్ధం

చైనాతో భారత్‌కు ఇబ్బందులు తప్పట్లేదు. దాయాది దేశమైన పాకిస్థాన్‌తో సరిహద్దుల వద్ద రోజూ పోరాటం చేస్తున్న భారత సైన్యానికి ప్రస్తుతం డ్రాగన్ కంట్రీ తలనొప్పిగా మారింది. చైనాతో సరిహద్దు ఘర్షణల పరిష్కారం కోసం ఇరుదేశాల మధ్య చర్చలు ఫలించకపోవడంతో దీర్ఘకాల శీతలయుధ్ధానికి భారతసైన్యం సన్నద్ధమైంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చెలరేగుతున్న తూర్పు లఢఖ్‌లో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్‌ సమాయత్తమైంది.

చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కోవడానికి గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా యుద్ధ ట్యాంకులను, ఇతర సామగ్రిని తరలించింది. వచ్చే నాలుగు నెలలు శీతాకాలంలో ఎత్తయిన పర్వత ప్రాంతమైన లఢఖ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయి. అక్టోబర్‌ నుంచి జనవరి మధ్య కాలంలో చలి మైనస్‌ 25 డిగ్రీల వరకు వెళుతుంది.

ఆ సమయంలో డ్రాగన్‌ దేశం ఎలాంటి కుయుక్తులు పన్నినా దీటుగా ఎదుర్కోవడానికి ఇండియన్‌ ఆర్మీ ఈ భారీ తరలింపు ప్రక్రియ చేపట్టింది. యుద్ధ ట్యాంకులు, భారీగా ఆయుధాలు, ఇంధనాన్ని తరలించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వాటితో పాటు సైనికులకు అవసరమైన ఆహారం దుస్తులు, బూట్లు తదితర సామగ్రిని చేరవేయడం దాదాపుగా పూర్తయింది. ఈ భారీ తరలింపు కసరత్తుని చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ఎంఎం నారవాణే, మరికొందరు కమాండర్లతో బృందంగా ఏర్పడి స్వయంగా పర్యవేక్షించారు.

లఢాఖ్‌కు భారీగా ఆయుధాలు, ఆహారం, ఇతర సామగ్రి తరలించారు.రక్తం గడ్డ కట్టే చలి నుంచి రక్షణ కోసం యూరప్‌ దేశాల నుంచి దుస్తుల్ని తెప్పించి ఇప్పటికే సైనికులకి అందించారు. ఈ సామగ్రిని తరలించడానికి వైమానిక దళానికి చెందిన సి-130జే సూపర్‌ హెర్క్యులస్, సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ హెలికాప్టర్లను వినియోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares