చైనాయే కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించింది: మళ్లీ ఆరోపించిన ట్రంప్

ఐరాస జనరల్ అసెంబ్లీ: చైనాయే కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించింది: మళ్లీ ఆరోపించిన ట్రంప్
అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ మంగళవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశంలో కూడా కనిపించింది. కరోనా వ్యాప్తికి చైనాయే కారణమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఆరోపించారు. దీనికి చైనా బాధ్యత వహించాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పారు.
అయితే ప్రపంచంలో ఏ దేశంతోనూ ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్‌వార్) చేసే ఉద్దేశం తమకు లేదని తన ప్రసంగంలో చైనా అధినేత షి జిన్‌పింగ్ అన్నారు.
గత కొద్దికాలంగా అమెరికా చైనాల మధ్య కరోనా వైరస్, వాణిజ్యం తదితర అంశాలపై మాటల యుద్ధం నడుస్తోంది.
ఏటా న్యూయార్క్‌లో జరిగే ఈ సమావేశం కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి వర్చువల్‌గా జరిగింది. వివిధ దేశాల నేతలు తమ ప్రసంగాలను రికార్డ్ చేసి పంపించారు.
ఈ సమావేశాన్ని తాను సాధించిన విజయాలను, ప్రత్యర్ధుల వైఫల్యాలను ప్రపంచానికి, అమెరికా ప్రజలకు చూపడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వినియోగించుకున్నారు.
వైరస్‌ను వ్యాప్తి చేసింది చైనాయే: ట్రంప్
“ఈ వైరస్‌ను ప్రపంచానికి అంటించిన చైనా కచ్చితంగా దానికి బాధ్యత వహించాలి’’ అన్నారు ట్రంప్.
“వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో చైనా దేశీయ విమానాలను ఆపేసి, అంతర్జాతీయ విమానాలను నడిపింది. ఆ కారణంగానే వైరస్ ప్రపంచానికి వ్యాపించింది. నేను చైనా విమానాలను అడ్డుకుంటే నాపై విమర్శలు చేసింది. వాళ్ల దేశంలో విమానాలు ఆపేసి, లాక్డౌన్లు ప్రకటించుకున్నారు’’ అని ట్రంప్ విమర్శించారు.
ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తుండగా, వైరస్‌ను వ్యాప్తి నివారణ విషయంలో అమెరికా అధ్యక్షుడి పనితీరు మీద అమెరికాలో పెద్ద చర్చ జరుగుతోంది. కానీ ట్రంప్ మాత్రం తరచూ చైనాను నిందిస్తూ వస్తున్నారు.
చైనా తలచుకుంటే వైరస్ వ్యాప్తిని ఆపగలిగేదని, కానీ అలా చేయలేదని ఆయన పదే పదే ఆరోపించారు. అయితే ట్రంప్‌వన్నీ నిరాధార ఆరోపణలని చైనా కొట్టి పారేసింది.
కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు 2 లక్షలమంది ప్రజలు మరణించారు.
వాణిజ్యం, టెక్నాలజీ, హాంకాంగ్ ప్రజాస్వామిక ఆందోళనలు, వీగర్ ముస్లింల అణచివేత, కరోనావైరస్‌వంటి అనేక అంశాలపై చైనా వైఖరిని అమెరికా తప్పుపడుతూ వస్తోంది.
అమెరికా అధ్యక్షుడి ప్రసంగం విన్న తర్వాత “ఇది నాగరితకల మధ్య యుద్ధానికి దారి తీస్తుంది’’ అని చైనా అధినేత షి జిన్‌పింగ్ హెచ్చరించారు.
“వివిధ దేశాలతో ఉన్న సమస్యలను మేం చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం. ప్రపంచంలో మేమొక్కళ్లమే ఎదగాలని, మిగిలిన వారు ఆర్థికంగా దెబ్బతినాలని కోరుకోవడం లేదు’’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.
“ ఏ దేశానికి మరో దేశం మీద పెత్తనం చేసే హక్కు లేదు. ఇతరులను అదుపులో పెట్టాలని, తాము ఒక్కరమే ఎదగాలని చూడటం సరికాదు’’ అని ట్రంప్ ప్రసంగం అనంతరం జిన్‌పింగ్ అన్నారు.
మరో 40 రోజుల్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఈ ప్రసంగం ద్వారా లబ్ధి పొందడానికి ట్రంప్ ప్రయత్నించారు. చైనాను టార్గెట్ చేయడం ద్వారా ఈ వైరస్ పాపం ఆ దేశానిదేనని తేల్చారు. దేశంలో లక్షలమంది మరణానికి చైనాయే కారణమని చెప్పే ప్రయత్నం చేశారు.
కరోనా వైరస్ నివారణలో తన వైఫల్యాలు బైటపడకుండా ఉండేందుకు ట్రంప్ చైనాను టార్గెట్ చేసుసుకున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి తాను చాలా ప్రయత్నాలు చేశానని ట్రంప్ చెప్పుకొన్నారు.
వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయని, వైరస్‌ను తరిమికొడతామని ప్రతిజ్జ చేశారు ట్రంప్.
చైనాను విమర్శించే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా ఆయన టార్గెట్ చేశారు. ఆ సంస్థ చైనా చేతుల్లో ఉందని, ఈ వైరస్‌కు సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేదని డబ్ల్యూహెచ్ఓపై ట్రంప్ విమర్శలు చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను నిలిపేస్తున్నట్లు ఇంతకు ముందే ట్రంప్ ప్రకటించారు.
ఈ సమావేశాన్ని ప్రారంభిస్తూ “మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించాలి’’ అని పరోక్షంగా అమెరికా, చైనాలను ఉద్దేశించి ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు.
“మనం ఇప్పుడు ఒక ప్రమాదకరమైన మార్గంలో ఉన్నాం. ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక శక్తులు ఘర్షణ పడటం మంచిది కాదు’’ అన్నారు గుటెరస్.
కరోనా వైరస్ విషయంలో స్వార్ధానికి తావులేదన్న గుటెర్రాస్, ప్రజాకర్షణ, జాతీయతావాదాలు ఈ వైరస్ ముందు నిలవలేదని అన్నారు. ఆ మార్గంలో కరోనా వైరస్‌ను అడ్డుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన గుర్తు చేశారు.
అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అందుకు భిన్నమైన వాదన చేశారు. “ మీరు మీ ప్రజలను కాపాడుకోడానికే ప్రాధాన్యం ఇస్తే ఇక పరస్పర సహకారం అనే మాట ఎక్కడుంది’’ అని ప్రశ్నించారు.