చైనా కొమ్ములు విరిచిన భారత్: వాస్తవాధీన రేఖ వద్ద త్రివర్ణ పతాకం రెపరెప


న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాకు కోలుకోలేని విధంగా భారత్ దెబ్బకొట్టిందా? తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తూ, సైనికులపై ప్రాణాంతక దాడులకు పాల్పడుతోన్న డ్రాగన్ కంట్రీని తేరుకోనివ్వని విధంగా షాక్ ఇచ్చిందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు పర్వతాలను భారత సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆరు పర్వతాలపై జెండా పాతిన జవాన్లు..

భౌగోళికంగా, వ్యూహాత్మకంగా కీలకంగా వ్యవహరించే ఆరు పర్వతప్రాంతాలపై భారత సైనికులు జెండా పాతారని తెలిపారు. వాస్తవాధీన రేఖ వద్ద ఏ దేశానికీ చెందని ఆరు పర్వత శిఖరాలను భారత సైన్యం తమ ఆధీనంలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించినట్లు జాతీయ వార్త సంస్థ పేర్కొంది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆర్మీ ఉన్నతాధికారులు దీన్ని ధృవీకరించినట్లు స్పష్టం చేసింది.

ఎవరికీ చెందని పర్వతాలపై చైనా కన్ను..
ఈ ఆరు పర్వతాలపైనా ఎప్పటి నుంచో చైనా బలగాలు కన్నేసి ఉంచాయని, దీన్ని పసిగట్టిన భారత సైన్యం దూకుడుగా వ్యవహరించినట్లు తెలిపింది. వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్న విషయాన్ని తేల్చి చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న మగర్ హిల్, గురుంగ్ హిల్, రెచెన్ లా, రెజంగ్ లా, మొఖ్పారిలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ వార్తా సంస్థ తన కథనంలో ప్రచురించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చైనా బలగాల ప్రతిఘటనల మధ్య ఈ ఆరు పర్వత పంక్తులు భారత సైనికుల ఆధీనంలోకి వచ్చినట్టయిందని తెలిపింది.

విడిపించడానికి విశ్వప్రయత్నాలు..
ఈ ఆరు పర్వతాలు భారత భూభాగంపైనే ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. అదే సమయంలో బ్లాక్ టాప్, హెల్మెట్ టాప్ పర్వతాలు వాస్తవాధీన రేఖకు అటువైపు ఉన్నాయని, వాటిని తమ నియంత్రణలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ ఘటన తరువాత చైనా తన దూకుడును మరింత పెంచిందని, ఈ ఆరు పర్వతాలను భారత సైన్యం ఆధీనం నుంచి తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రత్యేకించి- రెచెన్ లా, రెగంగ్ లా పర్వతాల పంక్తుల వద్ద చైనా మూడువేల మంది అదనపు సైన్యాన్ని మోహరింపజేపినట్లు తెలిపారు.

అదనపు బలగాల తరలింపు..
దీనితోపాటు- పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మోల్డో గ్యారిసన్ ట్రూప్స్ పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి తరలివస్తున్నట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పటికీ.. దాన్ని తిప్పి కొట్టడానికి సైన్యం సిద్ధంగా ఉందని, క్లిష్ట వాతావరణంలోనూ జవాన్లు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని ఆర్మీ అధికారులు వెల్లడించినట్లు ఆ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది. ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వాస్తవాధీన రేఖ వద్ద గల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares