జమ్మూ, కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్ ..నలుగురు జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్ లో తుపాకీల మోత మోగుతూనే ఉంది. తుపాకీ కాల్పుల శబ్దాలతో భయానక వాతావరణం నెలకొంది. భారతదేశం టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు గత కొంత కాలంగా ఇస్తున్న సమాచారంతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదుల ఏరివేత మొదలు పెట్టిన విషయం తెలిసిందే . అందులో భాగంగా ఈ రోజు కూడా ఎన్ కౌంటర్ కొనసాగుతుంది.
భద్రతా దళాలకు , ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి

ఉగ్రవాదుల కదలికల నేపధ్యంలో గత కొంత కాలంగా జమ్మూకాశ్మీర్లో అలజడి చెలరేగుతూనే ఉంది . నిత్యం ఏదో ఒక చోట ఎన్కౌంటర్ లు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. గురువారం ఉదయం నాగ్రోటా సమీపంలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి బాన్ టోల్ ప్లాజా సమీపంలో భద్రతా దళాలకు , ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. నిత్యం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న ఎన్ కౌంటర్ లతో జమ్మూ కాశ్మీర్ వాసులు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు.
ఉగ్రవాదులు జైష్-ఎ-మొహమ్మద్ కు చెందిన వారని గుర్తించిన భద్రతా దళాలు
సీనియర్ పోలీసు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, భద్రతా దళాలు హతమార్చిన ఉగ్రవాదులు జైష్-ఎ-మొహమ్మద్ కు చెందిన వారని గుర్తించారు. సాంబా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు మీదుగా యూనియన్ భూభాగంలోకి ఈ ఉగ్రవాదులు నిన్న సాయంత్రం చొరబడ్డారని, వారు రాబోయే జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు , పంచాయతీ ఉప ఎన్నికలకు అంతరాయం కలిగించడానికి భారీ మొత్తంలో ఆయుధాలు , మందుగుండు సామగ్రితో పాటు కాశ్మీర్‌కు వెళుతున్నారని డైరెక్టర్ జనరల్ దల్బాగ్ సింగ్ తెలిపారు.
బాన్ టోల్ ప్లాజా వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్

తెల్లవారుజామున 5 గంటల సమయంలో భద్రతా దళాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు ట్రక్కులో దాక్కున్న భద్రతా సిబ్బందిపై గ్రెనేడ్ విసిరారని, దాంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని అంటున్నారు . ఉగ్రవాదులు దాడులకు తెగబడటంతో బాన్ టోల్ ప్లాజా వద్ద మోహరించిన పోలీసులు మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను ట్రక్ నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు హతమార్చారని సమాచారం . ట్రక్ కాశ్మీర్ వెళ్తుండగా ఈ సంఘటన సంభవించింది .
ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు .. గతంలోనూ ఇక్కడే ఎన్ కౌంటర్

జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూపులోని ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. వీరిని అఖ్నూర్‌కు చెందిన కుల్దీప్ రాజ్ (32), నీల్ ఖాసిం బనిహాల్ రాంబన్‌కు చెందిన మహ్మద్ ఇషాక్ మాలిక్ (40) గా గుర్తించారు. ఇద్దరినీ జిఎంసి జమ్మూలో చేర్చారు, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 31 న కూడా ఇదే ప్రాంతంలో , బాన్ టోల్ ప్లాజా సమీపంలో ఒక పోలీసు బృందంపై ఉగ్రవాదుల బృందం కాల్పులు జరిపింది. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు మరియు భద్రతా సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి . వారు కూడా పాకిస్తాన్ నుండి సాంబా సెక్టార్‌లోని భూగర్భ క్రాస్ బార్డర్ టన్నెల్ ద్వారా వచ్చినట్లు బిఎస్ఎఫ్ గుర్తించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares