జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు లేవు… మీకేమో వేల కోట్ల విమానమా?


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక వీడియో షేర్ చేస్తూ, అందులో మోదీ ప్రభుత్వంలో జవాన్ల పరిస్థితి గురించి ప్రశ్నలు లేవనెత్తారు.

రాహుల్ గాంధీ షేర్ చేసిన వీడియోలో కొంతమంది జవాన్లు ఒక ట్రక్కు లోపల కూర్చుని తమను నాన్-బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పంపించడం గురించి చర్చించుకుంటూ కనిపిస్తారు.

ఈ వీడియోను ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ “మన జవాన్లను నాన్ బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కుల్లో అమరులు కావడానికి పంపిస్తున్నారు. ప్రధానికి 8400 కోట్ల విమానం. ఇది న్యాయమేనా” అని ప్రశ్నించారు.

ఈ వీడియోలో ట్రక్కులో కూర్చున్న జవాన్లలో ఒకరు, నాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పంపిస్తూ మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మిగతావారితో అంటుంటారు.

“నాన్ బీపీ (బుల్లెట్ ప్రూఫ్) వాహనంలో మనల్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడ బీపీ వాహనంలోనే ప్రాణాలకు రక్షణ లేదు, వీళ్లు నాన్ బీపీలో తీసుకెళ్తున్నారు. మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చెప్పిన తర్వాత కూడా బలవంతంగా ఎక్కించారు” అన్నాడు. ఆ జవాన్ ముఖాన్ని గుడ్డతో కప్పుకుని ఉన్నారు.

ఇంతలో మరో జవాన్ “అది చెప్పడం కమాండర్ పని” అంటారు. “కమాండర్ చెప్పకపోతే మనం తెలిసి తెలిసీ మన జీవితాలను నాశనం చేసుకోవాలా. కమాండర్ చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయన చెప్పడు. ఓసీ సార్, తన ఐదుగురు మనుషులను తీసుకుని బీపీలో వెళ్తారు. అందులో మరో పది మంది వెళ్లవచ్చు. మొత్తం సెక్షన్‌ను అందులోనే తీసుకెళ్లచ్చుకదా? వెళ్లి చావండని మనల్ని ఇందులో ఎక్కించారు” మొదటి జవాన్ అంటారు.

ట్రక్కును చేత్తో కొట్టిన ఆ జవాన్, దీన్ని రాయితో కొట్టినా అది ఆ వైపు నుంచి ఈ వైపు వచ్చేస్తుంది అన్నారు. తర్వాత కెమెరా ముందుకు వచ్చే మరో జవాన్ “వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. ఇది పనికిరాని వాహనం. ఓసీ, ఇన్‌స్పెక్టర్ బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంలో వెళ్తారు. టీమ్‌ను నాన్ బీపీలో పంపించండి అని చెబుతారు” అన్నారు.

అదే సమయంలో “వాహనం ఎక్కడ్నుంచి తేవాలి అంటున్నారు. మీరు ఏర్పాటు చేయవచ్చుగా. డ్యూటీకి తీసుకెళ్తున్నప్పడు అది మీ పని. మా జీవితాలతో ఆడుకుంటున్నారా. మా కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారా. మాతో డ్యూటీ చేయిస్తున్నప్పుడు, మాకు ఏర్పాట్లు చేయడం కూడా మీ బాధ్యత” అని మొదటి జవాన్ అంటారు.

రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో ఈ వీడియో సోర్స్ గురించి సమాచారం ఇవ్వలేదు. ట్రక్‌లో కూర్చున్న వారు సైనికులా లేక పారామిలిటరీనా అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. వారు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడ డ్యూటీ చేయడానికి వెళ్తున్నారో కూడా ఆ వీడియోలో చెప్పడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares