టీటీడీ ఈవోగా కేఎస్ జవహర్‌రెడ్డి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్యశాఖ తరపున జవహర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడంతో ఏపీ ప్రభుత్వం ఆయనను టీటీడీ ఈవోగా బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రేపు టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. అనిల్ కుమార్ సింఘాల్ అక్టోబర్ 2నే టీటీడీ ఈవో బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించేవరకు టీటీడీ ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం జవహర్ రెడ్డి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్యశాఖ తరపున జవహర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడంతో ఏపీ ప్రభుత్వం ఆయనను టీటీడీ ఈవోగా బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2017 మే నెలలో టీటీడీ ఈవోగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనకు టీటీడీ ఈవోగా బాధ్యతలు అప్పగించింది. సింఘాల్ రెండేళ్ల పదవీకాలం 2019లో ముగిసింది. అయితే, వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఈవోగా కొనసాగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది.
అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించడం మీదే అప్పట్లో విమర్శలు వ్యక్తం అయ్యాయి. సహజంగా తెలుగువారు లేదా దక్షిణాది వారు ఆ పదవిలో ఉంటారు. కానీ, మొదటిసారి ఉత్తర భారతదేశానికి చెందిన అధికారిని నియమించడంతో అప్పట్లో తెలుగు అధికారుల్లో అసంతృప్తి వ్యక్తం అయింది. అయితే, బీజేపీ ఒత్తిడి వల్లే చంద్రబాబు ఏకే సింఘాల్‌ను నియమించారనే ప్రచారం కూడా ఉంది.
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి సీఎం జగన్ వెళ్లిన సమయంలో ఆయన డిక్లరేషన్ సమర్పించాలంటూ ప్రతిపక్షాలు భారీ ఎత్తున డిమాండ్ చేశాయి. ఐనప్పటికీ డిక్లరేషన్‌పై సంతకం చేయకుండానే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సంప్రదాయ పంచెకట్టు, నుదుట తిరునామంతో గరుడ వాహన సేవలో ఆయన పాల్గొన్నారు. ఇక బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ఈవో బాధ్యతల నుంచి సింఘాల్‌ను తప్పించి జవహర్ రెడ్డిని ఈవోగా నియమించింది ప్రభుత్వం. సింఘాల్‌ను వైద్యఆరోగ్యశాఖకు బదిలీ చేసింది.