టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ, ఇంఛార్జీగా ధర్మారెడ్డికి బాధ్యతలు..

తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. కీలకమైన వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2017 మే నుంచి టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు మూడేళ్లకు పైగా పనిచేశారు. టీటీడీ అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. తాత్కాలికంగా ధర్మారెడ్డి బాధ్యతలను నిర్వహిస్తారు. కొత్త ఈవోగా జవహర్‌రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ క్రమంలో సింఘాల్ వైద్యారోగ్యశాఖకు రాగా.. టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి వెళ్లనున్నారు. తనను టీటీడీ ఈవోగా నియమించాలని జవహర్ రెడ్డి అడుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్‌ మంచి అధికారిగా పేరు సంపాదించారు. అయితే టీటీడీ ఈవోగా నియమించే సమయంలో విమర్శలు వచ్చాయి. ఇతర రాష్ట్రాలకు చెందినవారిని నియమించొద్దు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ అప్పటి ప్రభుత్వం ముందుకెళ్లింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నర పాటు టీటీడీ ఈవోగా పనిచేశారు. కానీ ఆకస్మాత్తుగా బదిలీ చేయడం చర్చకు దారితీసింది. జవహర్ రెడ్డి అడిగారని బదిలీ చేశారా? లేదంటే మరెమైనా కారణం ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే బ్యూరోక్రాట్లను మూడేళ్లకు మించి ఒకచోట ఉంచరని సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares