ట్రంప్ కు మరో షాక్.. ఓటమి తప్పదా?

ట్రంప్ కు మరో షాక్.. ఓటమి తప్పదా?
గత వారం జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్ పై ఆధిక్యం సాధించారు. ట్రంప్ కన్నా ఆయనకు 14 శాతం పాయింట్లు అధికంగా వచ్చాయి.

అగ్రరాజ్యం అమెరికా.. భారత్ తర్వాత ప్రపంచంలో రెండో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే అతి పెద్ద పండగ. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని ప్రజాస్వామ్యం కల్పిస్తోంది. త్వరలో ఆ ప్రజాస్వామ్య పండగ అమెరికాలో రానుంది. ఇప్పటికే అక్కడ ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ప్రచారం సైతం సాగుతోంది. నవంబర్ 3న జరగనున్న ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్‌, రిపబ్లిక్‌ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కు కరోనా సోకడంతో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇది ఆయనకు కొంచెం ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

ఈ సమయంలో ట్రంప్ కు మరో షాక్ తగిలింది. గత వారం జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ ట్రంప్ పై ఆధిక్యం సాధించారు. ట్రంప్ కన్నా ఆయనకు 14 శాతం పాయింట్లు అధికంగా వచ్చాయి. ఈ డిబేట్ అనంతరం బిడెన్ కు అనుకూలంగా 53 శాతం పాయింట్లు రాగా, ట్రంప్ కు 39 శాతం పాయింట్లు మాత్రమే వచ్చాయి. సెప్టెంబర్ 20న వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వేతో పోల్చితే బైడెన్ కు 6 శాతం పాయింట్లు పెరిగాయి. ఈ పోల్ సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 మధ్య నిర్వహించారు. ట్రంప్ కు కరోనా సోకిన విషయం ప్రకటించడానికి కొద్ది సేపటి క్రితం ఈ పోల్ పూర్తయింది.

ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్ పాల్గొన్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌తో ఈ చర్చ వాడీవేడీగా జరిగింది. ఆరోగ్యం, న్యాయం, జాతి వివక్ష, ఆర్థిక వ్యవస్థ లాంటి రకరకాల అంశాలపై ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చించారు. డిబేట్‌కు అమెరికా న్యూస్ చానల్ ఫాక్స్ న్యూస్ యాంకర్ 72 ఏళ్ల క్రిస్ వాలెస్ హోస్ట్‌‌గా వ్యవహరించారు. కరోనా వేళ సామాజిక దూరం నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలను అనుమతించారు. ఇక కరోనా విజృంభణ కారణంగా ఇద్దరు నేతలు కరచాలనం చేయలేదు.

అధ్యక్ష ఎన్నికల్లో ప్రజానాడిని కనుగొనేందుకు సెప్టెంబర్ ప్రారంభంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లోనూ అత్యధికులు డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వైపే మొగ్గుచూపారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కంటే జో బైడెన్ 12 శాతం ఎక్కువ ఓట్లు సాధించినట్లు Reuters/Ipsos ఒపీనియన్ పోల్ వెల్లడించింది. సెప్టెంబర్ 3 తేదీ నుంచి 8వ తేదీకి మధ్య చేపట్టిన ఈ అభిప్రాయ సేకరణ వివరాలను 9న వెల్లడించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 52శాతం మంది తాము బైడెన్‌కు ఓటువేయబోతున్నట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేయగా… 40 శాతం మంది ట్రంప్‌కు బాసటగా నిలిచారు. 3 శాతం మంది తాము మరో అభ్యర్థికి ఓటువేయనున్నట్లు చెప్పగా…5 శాతం మంది అధ్యక్ష ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares