డికాక్‌, సూర్యకుమార్‌ మెరుపు హాఫ్ సెంచరీలు.. ఢిల్లీపై ముంబై విజయం!!

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ సహా ఫీల్డింగ్‌లోనూ అద్భుత విన్యాసాలు చేసిన ముంబై అదరహో అనిపించింది. క్వింటన్‌ డికాక్ ‌(53: 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్ ‌(53: 32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధ శతకాలతో రాణించడంతో 163 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండానే ఛేదించింది. మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో ముంబై అగ్రస్థానానికి చేరింది.

లక్ష ఛేదనలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన ఐదో ఓవర్లోనే ఔటయ్యాడు. ఈ దశలో క్వింటన్ డికాక్‌, సూర్య కుమార్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన డికాక్.. 33 బంతుల్లోనే హాఫ్ ‌సెంచరీ పూర్తి చేశాడు. డికాక్‌ మెరుపులతో ముంబై లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. తొలి మూడు ఓవర్లలో పరుగులు రాబట్టడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన ముంబై.. డికాక్‌, సూర్యకుమార్‌ మెరుపులతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే ఆర్ అశ్విన్‌ వేసిన 10వ ఓవర్లో డికాక్‌ ఔటైన తర్వాత ముంబై స్కోరు వేగం తగ్గింది.
సూర్యకుమార్‌ షో:

మధ్య ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు పరుగులను నియంత్రించారు. ఇక అక్షర్‌ వేసిన 13వ ఓవర్లో సూర్యకుమార్‌ రెండు ఫోర్లు బాది 12 రన్స్‌ రాబట్టాడు. రబాడ వేసిన 15వ ఓవర్లో ఫోర్‌, సిక్సర్‌ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకొని పెవిలియన్‌ చేరాడు. ఇక ముంబై సమీకరణం 30 బంతుల్లో 33 పరుగులుగా మారింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా (0).. కీపర్‌ క్యాచ్‌కు ఔటయ్యాడు. చివరలో యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్ ‌(28: 15 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) మంచి ప్రదర్శన చేశాడు. ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు అవసరం కాగా కృనాల్‌ పాండ్యా (12 నాటౌట్‌) రెండు ఫోర్లు కొట్టి విజయాన్నందించాడు. కీరన్ పొలార్డ్‌ (11 నాటౌట్‌) సహకరించాడు. ఢిల్లీ బౌలర్లలో రబాడ, స్టాయినిస్‌, అశ్విన్, అక్షర్‌ తలో వికెట్ తీశారు.
రహానే విఫలం:
అంతకుముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా (4; 3 బంతుల్లో, 1×4)ను ట్రెంట్ బౌల్ట్‌ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్యా వేసిన ఐదో ఓవర్లో వన్‌డౌన్‌లో వచ్చిన అజింక్య రహానే (15) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. సీజన్‌లో రహానే తొలి మ్యాచ్‌ ఆడాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ అయ్యర్ ‌(42; 33 బంతుల్లో 5 ఫోర్లు) ‌తో కలిసి శిఖర్ ధావన్ (69 నాటౌట్;‌ 52 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌ )‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.
ధావన్‌ అర్ధ సెంచరీ:

ధావన్, అయ్యర్ ఇద్దరూ ముచ్చటైన షాట్లతో అలరించి మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో శ్రేయస్ ఔటయ్యాడు. బౌల్ట్‌ వేసిన 16వ ఓవర్లో ధావన్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సీజన్‌లో అతనికిదే తొలి హాఫ్‌సెంచరీ. ఇదే ఓవర్‌లో మార్కస్ స్టాయినీస్‌ (13; 8 బంతుల్లో 2×4) వరుసగా రెండు ఫోర్లు బాది ప్రమాదకరంగా కనిపించాడు. రాహుల్‌ చహర్‌ వేసిన 17వ ఓవర్లో అనూహ్యంగా స్టాయినీస్‌ రనౌట్ అయ్యాడు. రెండో పరుగు కోసం ప్రయత్నించిన స్టాయినిస్‌ రనౌటయ్యాడు. దీంతో స్కోరు వేగం తగ్గింది. డెత్‌ ఓవర్లలోనూ ఢిల్లీ భారీగా పరుగులు రాబట్టలేకపోయింది. చివరి బంతి వరకు క్రీజులో ఉన్న ధావన్‌ స్కోరును 160 దాటించాడు. ముంబై బౌలర్లలో కృనాల్ రెండు వికెట్లు, బౌల్ట్‌ ఒక్క వికెట్ తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares