డొనాల్డ్ ట్రంప్-బిడెన్ డిబేట్: భారీగా పెరిగిన బంగారం ధరలు, ముంబైలో తక్కువ..


బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. నేడు (మంగళవారం, సెప్టెంబర్ 29) ముంబైలో పసిడి ధరలు రూ.690 వరకు పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ.50,447 పలికింది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో మొదటి యూఎస్ ప్రెసిడెన్షియల్ డిబెట్‌కు ముందు డాలర్ వ్యాల్యూ క్షీణించింది. ట్రంప్, జోబిడెన్ మొదటి అధ్యక్ష చర్చకు హాజరు కానున్నారు. మొదటి అధ్యక్ష చర్చ క్లీవ్‌ల్యాండ్స్‌లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ వర్సిటీలో గంటన్నర పాటు జరగనుంది. ఆరు సమస్యలపై చర్చిస్తారు. 24 రోజుల వ్యవధిలో మిగతా రెండు చర్చలు జరుగుతాయి. సిక్స్ డాలర్ బాస్కెట్‌లో డాలర్ బలహీనపడటంతో పసిడి ధరలు పెరిగాయి. అయితే సిక్స్ బాస్కెట్‌లోని ఇతర కరెన్సీలో బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. మన దేశంలో రిటైల్ మార్కెట్లో పసిడి ధరకు మూడు శాతం జీఎస్టీ ఉంటుంది. గత వారం భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ వారంలో పెరుగుదలను చూస్తున్నాయి.

పెరిగిన బంగారం ధర

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో (MCX) పసిడి ధరలు ఈ రోజు 50వేల మార్క్ దాటాయి. రూ.50,439 వరకు కూడా పలికింది. సాయంత్రం సెషన్ సమయానికి డిసెంబర్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.287కు పైగా పెరిగి రూ.50,420 దాటింది. బిజినెస్ టర్నోవర్ 15,211 లాట్లుగా ఉంది. అక్టోబర్ ఫ్యూచర్ రూ.302 పెరిగి రూ.50,435 పలికింది. బిజినెస్ టర్నోవర్ 264 లాట్లుగా ఉంది. అక్టోబర్, డిసెంబర్ కాంట్రాక్ట్ వ్యాల్యూ వరుసగా రూ.228.33, రూ.2,649.01 కోట్లుగా ఉంది. మినీ గోల్డ్ నవంబర్ కాంట్రాక్ట్ రూ.157 పెరిగి రూ.50,352 పలికింది. బిజినెస్ టర్నోవర్ 10,788 లాట్లుగా ఉంది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ.1,000కు పెరిగి దాదాపు రూ.61,400కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో

సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 4 శాతం మేర క్షీణించింది.ఈ రోజు మాత్రం పసిడి ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ 1,886.86 డాలర్లకు చేరుకుంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి 1,889.30 డాలర్లు పలికింది. డాలర్ 0.2 శాతం మేర క్షీణించింది. అమెరికా ఎన్నికలు, కరోనా కేసులు పెరగడం, బంగారం ధరలు అస్థిరంగా ఉండటం వంటి వివిధ కారణాలతో ఇన్వెస్టర్లు రిటర్న్స్ తీసుకుంటున్నారు. పసిడిపై ఈ ప్రభావం కూడా పడింది.
నగరాల్లో బంగారం ధర

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.46,209, 24 క్యారెట్ల పసిడి రూ.50,447కు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నిన్న బంగారం ధరలు 10 గ్రాములు రూ.51,700 పలికింది. ముంబైలో బంగారం అమ్మకానికి అధికంగా వస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉండటం, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోలేదు. దీంతో బంగారం డిమాండ్ తగ్గుతోంది. ధరలు పెరుగుతాయని భావిస్తున్న వారు బిస్కెట్ల రూపంలో బంగారాన్ని, బార్‌ల రూపంలో వెండిని కొనుగోలు చేశారు. నిన్నటి వరకు డాలర్ వ్యాల్యూ పెరగడంతో పసిడిపై పెట్టుబడులు తగ్గి, ధరలు తగ్గడంతో మరింత తగ్గుతాయనే ఆందోళనతో చాలామంది అమ్మకాలకు మొగ్గు చూపారు. అందుకే ముంబైలో బంగారం, వెండి ధరలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఈ రోజు తిరిగి పెరిగాయి. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పసిడి రూ.48,500కు చేరుకోవచ్చునని అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares