తదుపరి మ్యాచ్‌కు అశ్విన్ రెడీ: శ్రేయస్ అయ్యర్


దుబాయ్: కింగ్స్ పంజాబ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో తమ విజయానికి కగిసో రబడానే కారణమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. తమ గేమ్ చేంజర్ అతనేనని కొనియాడాడు. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. సూపర్ ఓవర్ స్పెషలిస్ట్‌గా బంతిని అందుకున్న రబడా వరుసగా రెండు వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించాడు. ఇక మ్యాచ్ అనంతరం ఈ విజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. రబడాను ప్రశంసించాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ గాయంపై కూడా స్పందించాడు.

‘ఈ ఉత్కంఠ పరిస్థితుల్లో విజయాన్నందుకోవడం చాలా కష్టం. గత సీజన్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. నిజం చెప్పాలంటే ఇది మాకు అలవాటైంది. మా గేమ్ చేంజర్ రబడానే. టాపార్డర్ బ్యాట్స్‌మన్‌ను అడ్డుకోవడం అంత సులువు కాదు. క్యాచ్ డ్రాప్‌లకు లైటింగ్ కారణమని చెప్పను. ప్రాక్టీస్ లోపం వల్లే ఇలా జరిగింది. ఈ తప్పులను సవరించుకొని మెరుగవుతాం. కగిసో రబడా ఓవర్ల కోటాను ఆపుకోవడమే మంచిదైంది. రబడా ఉంటే గెలవచ్చని ముందే అనుకున్నా. అది పనిచేసింది. స్వల్ప టార్గెట్‌లను కాపాడుకోవాలంటే వికెట్లు తీయడం చాలా ముఖ్యం. అశ్విన్ మాకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. అతను తదుపరి మ్యాచ్ ఆడే విషయం ఫిజియోనే తేల్చాలి. కానీ అశ్విన్ మాత్రం తాను తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని చెప్పాడు. అశ్విని నిష్క్రమించడంతో అక్సర్ స్పిన్ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. మేం మాములుగానే లెఫ్ట్, రైట్ కాంబినేషన్స్‌తో బరిలోకి దిగుతాం. అలానే సూపర్ ఓవర్ బరిలోకి దిగాం’అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి మంచి జోరుమీద కనిపించిన అశ్విన్‌ అంతలోనే గాయపడ్డాడు. తన తొలి ఓవర్‌ చివరి బంతిని పంజబ్ బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌ లాంగాన్‌ వైపు ఆడాడు. ఆ బంతిని ఆపే ప్రయత్నంలో అశ్విన్‌ నియంత్రణ కోల్పోయి కింద పడ్డాడు. ఈక్రమంలో అతని ఎడమచేతికి గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతున్న అశ్విన్‌ను వెంటనే మైదానం నుంచి బయటికి తీసుకెళ్లారు. శరీర బరువు మొత్తం ఒకే చేయిపై పడటంతో భుజంలో ఎముక కాస్త పక్కకు జరిగిందని ఫిజియో తెలిపాడు. అశ్విన్‌ కిందపడ్డ విధానం చూస్తే అతను ఈ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమయ్యేట్లుగా అనిపించింది. పరీక్షలు చేస్తే కానీ అతని గాయంపై క్లారిటీ రాదు. డిస్‌లొకేట్ అయితే మాత్రం అతను ఈ సీజన్ మొత్తానికి దూరం అవుతాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares