తిరుపతి ఉపఎన్నికపై విపక్షాల దృష్టి- టీడీపీ నుంచి రేసులో వర్ల, పనబాక- రంగంలో బీజేపీ అభ్యర్ధి ?


వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్‌సభ స్ధానంలో త్వరలో జరిగే ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు దృష్టిసారిస్తున్నాయి. ఈసారి వైసీపీతో పాటు టీడీపీ, బీజేపీ అభ్యర్ధులు రంగంలో ఉంటారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత సంప్రదాయాలను పక్కనబెట్టి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విపక్షాలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్ధుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారబోతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్న విపక్షాలు… తిరుపతి ఉప ఎన్నిక వేదికగా దాన్ని నిరూపించేందుకు సిద్ధమవుతున్నాయి.

తిరుపతి ఉప ఎన్నిక…
వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణంతో ఖాళీ అయిన తిరుపతి ఎంపీ సీటుకు ఆరునెలల్లోగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా ప్రభావం కనిపిస్తున్నా రెండు, మూడు నెలల్లోగా పరిస్ధితి పూర్తిగా అదుపులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డిసెంబర్‌ తర్వాత ఏ క్షణాన్నైనా ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల సంఘం తిరుపతిలో పరిస్ధితులను అంచనా వేస్తోంది. రాజకీయ పార్టీలు కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్నాయి. కరోనా కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా పడినా ఈసారి తిరుపతి ఉప ఎన్నికపై మాత్రం ఆ ప్రభావం ఉండకపోవచ్చని తెలుస్తోంది.

సంప్రదాయానికి విపక్షాల గుడ్‌బై ?
గతంలో ఏపీలో సిట్టింగ్‌ ప్రజాప్రతినిధులు చనిపోతే వారి స్ధానంలో కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు విపక్షాలు సహకరించేవి. కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ స్ధానంలో జరిగిన ఉప ఎన్నికలో మాత్రం వైసీపీ పోటీకే మొగ్గు చూపింది. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు చాటేందుకు ఇదే మంచి తరుణమని భావించింది. కానీ ఫలితాలు మరోలా వచ్చాయి. అయితే అప్పట్లో వైసీపీ ప్రజాప్రతినిధులు సహజ మరణాలకు గురయినప్పుడు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుందంటూ నంద్యాల ఉప ఎన్నికల పోటీలో దిగింది. తీవ్రవాద దాడులు, మావోయిస్టుల చేతుల్లో హత్యలకు గురైన వారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పుకుంది. ఇప్పుడు అదే సూత్రాన్ని తిరుపతికి వర్తింపజేస్తూ పోటీకి విపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ రేసులో వర్ల, పనబాక..
తిరుపతి ఎంపీ స్ధానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ కోసం టీడీపీలో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఎస్సీ స్ధానం కావడంతో పాటు పార్టీలో ఎస్సీ ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా తక్కువగా ఉన్నందున టీడీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. అదే సమయంలో మూడు రాజధానులతో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయాన్ని ప్రజల్లో చూపించేందుకు ఇదే మంచి తరుణమని కూడా టీడీపీ భావిస్తోంది. అందుకే టీడీపీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు టీడీపీ రేసులో గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మితో పాటు సీనియర్‌ నేత వర్ల రామయ్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి వర్ల రామయ్య ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా రేసులోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares