న్యాయ వ్యవస్థపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు .. కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఎంపీలు

కనకమేడల,రామ్మోహన్ నాయుడు
రాజ్యసభలో టిడిపి వైసిపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కరోనా మహమ్మారి పై పోరులో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల రాజ్య సభ వేదికగా ప్రస్తావించారు. కనకమేడల తర్వాత మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అమరావతి పై సిట్ దర్యాప్తు కు హైకోర్టు స్టే ఇవ్వడంపై వ్యాఖ్యానించారు. కోర్టులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి .
టీడీపీ పాలనపై విచారణ వెనుక .. వైఎస్ జగన్ కు సీబీఐ కేసుల భయం ఉందన్న యనమల
కోర్టులపై విజయసాయి అనుచిత వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ ఎంపీలు
కరోనా నివారణ చర్యలపై మాట్లాడాల్సిన విజయసాయిరెడ్డి ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం అంటూ వ్యాఖ్యలు చెయ్యటంపై భగ్గుమన్న టీడీపీ ఎంపీ కనకమేడల విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు తొలగించాలని, కోర్టులను కూడా బెదిరించే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
హైకోర్టు ఆదేశాలపై రాజ్యసభలో మాట్లాడిన విజయ సాయి రెడ్డి న్యాయవ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను టిడిపి ఎంపీలు కనకమేడల రవీంద్ర, ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు.
కోర్టులపై బురద చల్లాలన్న ఏకైక లక్ష్యంతో వైసీపీ ఉందన్న కనకమేడల
న్యాయస్థానాలు ఎవరికి అనుకూలంగా వ్యవహరించవని, కోర్టులపై బురద చల్లాలి అన్న ఏకైక లక్ష్యంతో వైసిపి పనిచేస్తోందని కనకమేడల మండిపడ్డారు.
పార్లమెంట్లో ఒక అంశంపై చర్చ జరుగుతుంటే ఆ అంశాన్ని పక్కనపెట్టి న్యాయ స్థానాలపై మాట్లాడతారా అంటూ కనకమేడల ఫైర్ అయ్యారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి న్యాయస్థానాలపై విరుచుకుపడడం సరికాదని, వైసిపి సోషల్ మీడియాలో న్యాయమూర్తులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని కనకమేడల రవీంద్ర కుమార్ వైసీపీ తీరును తప్పుబట్టారు.
కోర్టులపై అనుచిత వ్యాఖ్యలు మంచిది కాదన్న రామ్మోహన్ నాయుడు
రాజధాని ప్రకటన తర్వాత ఆస్తులు కొన్ని వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, 3 రాజధానుల పేరుతో విశాఖలో భూదందాలు సాగిస్తున్నారని ఎంపీ కనకమేడల ఆరోపించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పబ్బం కోసం అన్ని సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కోర్టుల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడారు.
చంద్రబాబును విమర్శించిన వాళ్ళకే పదవులు
టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారు అన్న రామ్మోహన్ నాయుడు, కోర్టుల తీర్పులు వైసిపికి అనుకూలంగా లేకపోతే విమర్శిస్తారా అంటూ ప్రశ్నించారు. కోర్టులను బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు విమర్శించిన వాళ్లకే పదవులు వస్తున్నాయని, అందుకే వారు వైయస్సార్ పేరు కంటే చంద్రబాబు జపమే ఎక్కువ చేస్తున్నారని పేర్కొన్నారు రామ్మోహన్ నాయుడు.
విజయసాయి వ్యాఖ్యలు రికార్డుల నుండి తొలగించాలంటూ డిమాండ్
న్యాయమూర్తులను భయబ్రాంతులకు గురి చేసి అయినా తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు పార్టీగా పేరు మార్చుకోమని రామ్మోహన్ నాయుడు సలహా ఇచ్చారు. విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని కోరారు.
ఏసీబీ విచారణ, కోర్టుల జోక్యం లాంటి అంశాలపై మాట్లాడరాదంటూ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ వారించినప్పటికీ వినకుండా ఆయన వ్యాఖ్యలు చేశారు
