‘పగలు విగ్గు, రాత్రి పెగ్గు’ వైసీపీ ఎంపీపై నందిగం సురేష్ సెటైర్లు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సెటైర్లు వేశారు. ఇటీవల వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తున్న నర్సాపురం ఎంపీను నందిగం సురేష్ ఎద్దేవా చేశారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సెటైర్లు వేశారు. ఇటీవల వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తున్న నర్సాపురం ఎంపీను నందిగం సురేష్ ఎద్దేవా చేశారు. ‘రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్. పగలు విగ్గు – రాత్రి పెగ్గు’ అంటూ విమర్శలు చేశారు. ఇటీవల రఘురామకృష్ణంరాజు ఫోటో ఒకటి విపరీతంగా వైరల్ అయింది. ఆయన నోట్లో ఒక విదేశీ యువతి షాంపేన్ పోస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైసీపీ అభిమానులు ఆ ఫొటోను ఆధారంగా చేసుకుని రఘురామకృష్ణంరాజును ట్రోల్ చేశారు. ఈ ఫోటో ఒరిజినల్లా? కాదా? అనే విషయంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ స్పందించారు. ఆ ఫొటోలో ఉన్నది తానేనని స్పష్టం చేశారు. షాంపేన్ అనేది క్రికెటర్లు కూడా తాగుతారని చెప్పారు. ఆ అమ్మాయితో తానేమీ అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఎక్కడా తాకలేదన్నారు. నోట్లో మద్యం పోసినంత మాత్రాన అదేదో తప్పు చేసినట్టు కాదన్నారు. రఘురామకృష్ణంరాజు అంతటితో ఆగలేదు. వైసీపీ నేతలు ఇచ్చే పార్టీల్లో కూడా రష్యన్ భామలు ఉంటారని ఆయన చెప్పారు. “ఏముంది ఆ ఫోటోలో.. మీరు సప్లై చేసే ప్రెసిడెంట్ మెడల్, నోబెల్ ప్రైజ్ వంటి చెత్త డ్రింకులు తాగకుండా షాంపేన్ తాగితే బాధగా ఉందా?’ అని జగన్ ప్రభుత్వం మద్యం పాలసీ మీద చురకలు అంటించారు. గత కొన్ని నెలలుగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద రఘురామకృష్ణం రాజు విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు అమరావతి ప్రాంతంలో జరుగుతున్న దీక్షలను అందరూ చూశారని నందిగం సురేష్ అన్నారు. మూడు రాజధానులు ఉండాలని, అమరావతిలో తమకు కూడా ప్లాట్లు కావాలని దీక్షలు చేస్తున్న వారిపై టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ ఎంపీ మండిపడ్డారు. అమరావతిలో మూడు రాజధానుల కోసం దీక్షలు చేసే వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ టీడీపీ నేతలు ఆరోపించడం దారుణమన్నారు. పేదవారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ధర్నాల్లో ఆర్టిస్ట్ లను, సినిమా యాక్టర్ లను పెట్టింది ఎవరో అందరికి తెలుసని, సినీ నిర్మాతలకు, యాక్టర్ లకు చంద్రబాబు ఎంత కట్టపెట్టారో అందరికి తెలుసని సురేష్ అన్నారు.
‘ప్లాటుల కోసం, పొట్ట తిప్పల కోసం దీక్షలో కూర్చుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు ఏం విధంగా కామెంట్ చేశారో అందరూ చూశారు. పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల తలుచుకుంటే ఏం జరుగుతుందో చంద్రబాబు ప్రత్యక్షంగా చూశారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రజల్లోకి రావడం మానేసి అమరావతి పక్కనుండి పోరాటం చేస్తున్నారు. పేదవాళ్ల బాధలు ఎక్కడుంటే అక్కడ ఉంటానని లోకేష్ ట్వీట్ చేశాడు. వినతిపత్రం ఇద్దామని పేదలు ఎదురు చూస్తే రాలేదు. ఏ ఉద్యమంలో ఎంత నీతి, నిజాయితీ ఉందో తెలుస్తుంది. కృష్ణాయపాలెంలో టీడీపీ గుండాలు పేదవారిని అడ్డుకుని, కొట్టి, ట్రాక్టర్ తో పేదలను, దళితులను తొక్కించే ప్రయత్నం చేశారు. ఇంతకంటే నీచ సంస్కృతి ఇంకోటి లేదు’ అని నందిగం సురేష్ అన్నారు.