పబ్జీ కథ భారత్‌లో ముగిసిపోయినట్లే..

శుక్రవారం నుంచి భారత్‌లో పబ్జీ గేమ్ ఆడలేరని ఆ కంపెనీ ప్రకటించిందని ఈనాడు కథనం ప్రచురించింది.
ఆన్లైన్ వార్‌గేమ్ పబ్జీ కథ భారత్‌లో ముగిసిపోయినట్లే.
ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం నుంచి భారత్‌లో తమ సేవలను రద్దు చేసుకుంటున్నట్లు సంబంధిత సంస్థ టెన్సెంట్ గేమ్స్ ప్రకటించిందని ఈనాడు రాసింది.
దేశ భద్రత దృష్ట్యా పబ్జీ మొబైల్ వెర్షన్లను భారత ప్రభుత్వం రెండు నెలల కిందట నిషేధించింది.
అయితే, అంతకుముందు యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రం ఈ గేమ్‌ని ఆస్వాదించే వెసులుబాటు ఉండేది.
తాజా నిర్ణయంతో ఈ గేమ్‌కి పూర్తిగా తెరపడింది.
‘‘వినియోగదారుల సమాచార భద్రతే అత్యంత ముఖ్యం. భారత డేటా భద్రత చట్టాలను, నిబంధనలను మేం పాటించాం. ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అక్టోబరు 30నుంచి పబ్జీ మొబైల్ నొర్డిక్ మ్యాప్- లివిక్, పబ్జీ లైట్ సేవలను టెన్సెంట్ నిలిపివేస్తోంది’’ అని పబ్జీ మొబైల్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసినట్లు ఈనాడు చెప్పింది.
పబ్జీతో పాటు 118 మొబైల్ యాప్‌లపై ఈ ఏడాది సెప్టెంబరు 2న భారత ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.