ఫస్ట్ మ్యాచ్‌కు ఆ ఆటగాడు దూరం!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ మరో మూడు రోజుల్లో షూరు కానుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ దూరం కానున్నాడు. కరోనా బారిన పడిన అతను 14 రోజుల ఐసోలేషన్ పూర్తైనా కోలుకోలేదు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటీవ్ రావడంతో క్వారంటైన్‌లోనే ఉన్నాడు.
స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా అర్ధాంతరంగా తప్పుకోవడంతో అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ భావించింది. కానీ అతను ఇంకా కరోనా నుంచి కోలుకోకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలు రచిస్తోంది. మురళీ విజయ్, అంబటి రాయుడులతో రైనా స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తోంది.
అయితే గైక్వాడ్‌కు పాజిటివ్ వచ్చినా అతనికి ఎలాంటి లక్షణాలు లేవని టీమ్ సీఈవో కాశీ విశ్వానాథన్ తెలిపారు. అతనికి ఫిట్నెస్ టెస్ట్ చేయాల్సి ఉందని, బీసీసీఐ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హజల్ వుడ్, ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ కరన్ కూడా ఫస్ట్ వీక్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదన్నారు. సీపీఎల్ 2020 ఆడిన ఆటగాళ్లు ఇమ్రాన్ తాహిర్, డ్వేన్ బ్రావో మాత్రం ఫస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఫస్ట్ వీక్‌లో చెన్నై మొత్తం 3 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 19న ముంబైతో, 22న రాజస్థాన్ రాయల్స్‌తో, 25న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
ఇక కరోనా బారిన పడిన మరో ఆటగాడు దీపక్ చాహర్ పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొంటున్నాడు. యూఏఈలో అడుగుపెట్టిన 6 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న సీఎస్కే టీమ్‌లో 11 మంది సహాయక సిబ్బందితో పాటు ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో ఆ జట్టు మరో వారంపాటు క్వారంటైన్ పాటించింది. ఈ క్రమంలోనే సురేశ్ రైనా భారత్‌కు వెళ్లగా.. హర్భజన్ సింగ్ లీగ్‌లో పాల్గొవడం లేదని తెలిపాడు.
ఇక బీసీసీఐ నిబంధనల ప్రకారం కరోనా సోకిన వ్యక్తి 14 రోజుల క్వారంటైన్‌ను పాటించాలి. ఐసోలేషన్ అనంతరం వరుసగా నిర్వహించే రెండు కోవిడ్-19 పరీక్షల్లో నెగటీవ్ రావాలి. అప్పుడే ఆ ఆటగాడిని ట్రైనింగ్‌కు అనుమతిస్తారు.