బిహార్‌లో మరో మౌంటెయిన్ మ్యాన్…

బిహార్ రాజధాని పట్నా నుంచి దాదాపు 200 కి.మీ.ల దూరంలో గయా జిల్లాలోని బాంకేబజార్ బ్లాక్‌ ఉంది. ఇక్కడ జనం ప్రధానంగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తుంటారు. కానీ, సాగు నీటి సౌలభ్యం లేకపోవడంతో వరి, గోధుమల్లాంటి లాభసాటి పంటలు పండించే పరిస్థితి ఇక్కడ లేదు.

దీంతో ఇక్కడి గ్రామాల యువత ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వలసపోవడం ఎక్కువైంది.

కోటిల్వా గ్రామంలో నివసించే లౌంగీ బూయియా కుమారులు కూడా ఇలాగే ఉపాధి వెతక్కుంటూ గ్రామం వదిలి వెళ్లిపోయారు.

మేకలు మేపుకుంటూ గ్రామం పక్కనే ఉన్న బంగేటా కొండ మీదకు వెళ్లినప్పుడు బూయియాకు ఓ ఆలోచన వచ్చింది. ‘గ్రామానికి నీళ్లు వస్తే, పంటలు పండి, వలసలు ఆగిపోతాయి కదా!’ అని ఆయన అనుకున్నారు.

ఈ ప్రాంతంలో వానాకాలంలో వర్షాలు పడతాయి. అయితే, నీరు బంగేటా కొండ మీదే నిలిచిపోతుంటుంది.

ఈ నీటిని ఎలాగైనా పంట పొలాల వరకూ రప్పించాలన్న ఆలోచన బూయియాకు వచ్చింది.

దీంతో ఆయన ఆ ప్రాంతమంతా తిరిగి, కొండ మీద నుంచి నీటిని పొలాల వరకూ తీసుకువచ్చేందుకు ఓ కాలువ తవ్వాలని ఓ మ్యాపు గీసుకున్నారు. ఒకటి, రెండు కాదు… ఏకంగా 30 ఏళ్లపాటు కాలువను తవ్వుతూ ఉన్నారు.

ఒంటరిగానే కష్టపడి ఐదు మీటర్ల వెడల్పు, మూడు అడుగుల లోతుతో మూడు కిలోమీటర్ల పొడవున ఓ కాలువను తవ్వారు.

కొండ మీదున్న నీటిని ఊరి చెరువు వరకూ తీసుకువచ్చారు.

గత ఆగస్టులోనే బూయియా కాలువ తవ్వడం పూర్తిచేశారు. ఆ తర్వాత కురిసిన వర్షాలతో ఆయన కృషికి ఫలితం కనిపించింది. చెరువులోకి నీళ్లు వచ్చాయి.

స్థానికంగా ఉన్న మూడు గ్రామాలకు చెందిన మూడు వేల మందికి ఈ చెరువు నీరు ఉపయోగపడుతోంది. అక్కడి రైతులు ఈసారి వరి, గోధమలు కూడా వేస్తున్నారు.

‘‘నేను ఒకసారి నిశ్చయించుకున్నాక, వెనక్కితగ్గే రకం కాదు. ఎప్పుడు ఖాళీ దొరికినా, కాలువ తవ్వే పనిలో మునిగిపోయేవాడిని. కాలువ పూర్తి చేయడం నా వల్ల కాదేమోనని నా భార్య అంటుండేది. కానీ, పూర్తి చేయొచ్చని నేను గట్టిగా నమ్మాను. నీళ్లు వస్తాయి, పొలం పనులు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఒక్కటే నా మనసులో మెదిలింది. పిల్లలు వలస పోకుండా, ఊర్లోనే ఉంటారు కదా అనుకున్నా. వరి, ఇతర ధాన్యాలు పండితే, కనీసం పొట్టైనా నిండతుంది కదా’’ అని ఆయన అన్నారు.

లౌంగీ బూయియా తవ్విన కాలువ
ఇదివరకు గయాలోని గెహ్లార్‌కు చెందిన దశరథ్ మాంఝీ ఒంటరిగా కొండను తవ్వి, తమ గ్రామానికి దారిని వేసి ‘మౌంటెయిన్ మ్యాన్‌’గా పేరు తెచ్చుకున్నారు. ఆయన జీవితం ఆధారంగా హిందీలో సినిమా కూడా వచ్చింది.

మాంఝీ తరహాలోనే ఇప్పుడు లౌంగీ బూయియాను కూడా అందరూ ‘మౌంటెయిన్ మ్యాన్’ అని పిలుస్తున్నారు.

‘‘ఈ పని మొదలుపెట్టినప్పుడు దశరథ్ మాంఝీ గురించి ముందు నాకు తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్నా. గ్రామానికి నీళ్లొస్తే పంటలు పండుతాయి, వలసలు ఆగిపోతాయి కదా అనిపించింది. ఎలాగైనా పొలాల వరకు నీటిని తీసుకురావాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నా’’ అని బూయియా అన్నారు.

బూయియాకు నలుగురు కుమారులు. వారిలో ముగ్గురు వలస వెళ్లి పనిచేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామంలోని ఇంట్లో బూయియాతోపాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు, వాళ్ల పిల్లలు ఉంటారు.

ఇప్పుడు మిగతా కుమారులు కూడా తిరిగివస్తారన్న ఆశతో బూయియా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares