బీజేపీలో అనూహ్య మార్పులు – టీమ్ నడ్డాలో పురందేశ్వరి, డీకే అరుణ


భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో సంస్థాగతంగా భారీ, అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 8 నెలల తర్వాత జేపీ నడ్డా తన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ ఉపాధ్యక్షుల నుంచి కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, యువమోర్ఛాలాంటి కీలక పోస్టుల్లో సీనియర్లను సైతం పక్కనపెట్టి, కొత్తవాళ్లకు అవకాశం కల్పించారు. సమగ్ర వివరాల్లోకి వెళితే..

రాంమాధవ్‌నూ పక్కన పెట్టేశారు..
జేపీ నడ్డా టీమ్ గా మీడయా అభివర్ణిస్తోన్న తాజా ప్రక్షాళన లేదా మార్పులకు సంబంధించి కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ఇన్ చార్జి రాంమాధవ్ ను జాతీయ కార్యదర్శి పదవి నుంచి పక్కకుపెట్టారు. అలాగే, మరో తెలుగువాడైన మురళీధర్ రావు, అనిల్ జైన్, సూరజ్ పాండే లాంటి సీనియర్లను సైతం జాతీయ కార్యదర్శి పదవుల నుంచి తప్పించారు. కొత్తగా నియమితులైన ఆఫీస్ బేరర్లకు రాంమాధవ్ శుభాకాంక్షలు చెప్పారు.

పురంధేశ్వరి, అరుణకు ప్రాధాన్యం
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి అమిత్ షా నీడ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న జేపీ నడ్డా తనకున్న అధికారాల మేరకు ఏర్పాటు చేసుకున్న టీమ్ లో మహిళలు, యువతకు ప్రాధాన్యం దక్కడం గమనార్హం. తాజా నియామకాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మహిళలకు ప్రమోషన్ దక్కినట్లయింది. ఏపీ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి.. జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమెతో పటు మరో ఏడుగురు ఆ పదవిలో కొనసాగుతారు. ఇక తెలంగాణకు చెందిన మరో మహిళా నేత డీకే అరుణను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. అరుణతోపాటు మరో 11 మందికి ఉపాధ్యక్ష పోస్టులు దక్కాయి.

తేజస్వీ సూర్యకు ప్రమోషన్..
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే కర్ణాటక ఎంపీ తేజస్వీ సూర్యకు పార్టీలో ప్రమోషన్ లభించింది. భారతీయ జనతా యువమోర్ఛ(బీజేవైఎం) అధ్యక్షుడిగా తేజస్విని నియమించారు. అదే సమయంలో కర్ణాటకే చెందిన యువ మంత్రి సీటీ రవి కూడా జాతీయ కార్యదర్శిగా ప్రమోషన్ పొందారు. బీజేపీ ఓబీసీ మోర్ఛా చీఫ్ గా తెలంగాణకు చెందిన కే.లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ నియామకాలకు సంబంధించి బీజేపీ హైకమాండ్ శనివారం అధికారిక ప్రకటన చేసింది.

జాతీయ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు వీళ్లే..
బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా జాతీయ ఉపాధ్యక్షులుగా మొత్తం 13 మంది నియమితులయ్యారు. వారిలో డీకే అరుణ, రమణ్ సింగ్, వసుంధరా రాజే, రాధా మోహన్ సింగ్, బైజయంత్ పండా, రఘుబర్ దాస్, మకుల్ రాయ్, రేఖా వర్మ, అన్నపూర్ణా దేవి, భారతి బెన్ శయాల్, చుబా ఆవ్, అబ్దుల్లా కుట్టీ తదితరులు ఉన్నారు. ఇక జాతీయ కార్యదర్శులుగా నియమితులైన 8 మందిలో పురంధేశ్వరి, భూపేంద్ర యాదవ్, అరుణ్ సింగ్, కైలాశ్ విజయ్ వర్గియా, దుష్యంత కుమార్, సీటీ రవి, తరుణ్ చువాంగ్, దిలిప్ సైకియా ఉన్నారు. ఆర్గనేజేషనల్ సెక్రటరీగా ఆర్ఎస్ఎస్ నేత బీఎల్ సంతోష్ కొనసాగనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares