బీజేపీ.. నెక్ట్స్ టార్గెట్ జీహెచ్ఎంసీ ఎన్నికలు !

దుబ్బాక ఉప ఎన్నికల తరువాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉంటాయనే దానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. దుబ్బాకలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీ.. అక్కడ ఉప ఎన్నికలు పూర్తయిన వెంటనే తమ నెక్ట్స్ టార్గెట్ జీహెచ్ఎంసీ ఎన్నికలు అని బాహాటంగానే ప్రకటించింది. రాబోయే రెండు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో… దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీకి కొండంత ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఒకప్పుడు తాము ఎంతో బలంగా ఉన్న గ్రేటర్ పరిధిలో తిరిగి బలం పుంజుకోవాలని.. మినీ అసెంబ్లీ ఎన్నికలకు భావించే గ్రేటర్‌లో సత్తా చాటడం వల్ల తెలంగాణలో తామే టీఆర్ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయమని మరోసారి చాటిచెప్పాలని బీజేపీ యోచిస్తోంది.

ఇప్పటికే గ్రేటర్‌లో బీజేపీ గెలుపు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న డివిజన్లపై దృష్టి పెట్టిన ఆ పార్టీ నేతలు.. గ్రేటర్‌లో ఈసారి టీఆర్ఎస్‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సీట్లు సాధించాలని పట్టుదలగా ఉన్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. దుబ్బాకలో తాము మెరుగైన ప్రదర్శన ఇచ్చినా… గ్రేటర్‌లో అది తమకు ఎంతో నైతిక బలం ఇస్తుందని బీజేపీ నేతలు భావించారు.
అలాంటిది ఇప్పుడు దుబ్బాకలో జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ విజయం సాధించడంతో… ఇదే ఊపును గ్రేటర్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టాన్ని, వరద సాయంలో జరిగిన అవకతవకలపై బీజేపీ గట్టిగానే గళం విప్పుతోంది. గ్రేటర్‌లో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని… మళ్లీ బీజేపీపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చేయాలని నిర్ణయించుకుంది.

మరోవైపు దుబ్బాకలో బీజేపీ గెలుపుతో టీఆర్ఎస్ సైతం గ్రేటర్ ఎన్నికల్లో విజయానికి మరింతగా కష్టపడాల్సి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో గ్రేటర్‌లో టీఆర్ఎస్ విజయంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన కేటీఆర్‌.. ఈ సారి అంతేస్థాయిలో గ్రేటర్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తారా ? అన్న దానిపై చర్చ మొదలైంది. మొత్తానికి దుబ్బాకలో టీఆర్ఎస్‌ను ఎదురుదెబ్బ కొట్టిన బీజేపీ… గ్రేటర్ విషయంలో టీఆర్ఎస్‌ను టెన్షన్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0