భారత్‌పై ఆక్రమణకు పాల్పడనున్న చైనా.. న్యూస్‌వీక్ ప్రత్యేక కథనం

ప్రస్తుతం భారత్ – చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. వీటిని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల వివిధ స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. అయితే, సరిహద్దుల్లో మాత్రం డ్రాగన్ కంట్రీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోంది. దీంతో సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలో త్వరలోనే భారత్‌పై చైనా ఆక్రమణకు పాల్పడే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ పత్రిక న్యూస్ వీక్ పేర్కొంది. ముఖ్యంగా, భారత్‌తో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించేలా చర్యలు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. ఆయన చైనాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, భారత ఆర్మీ వాటన్నింటినీ తిప్పికొడుతోంది. దీంతో జిన్ పింగ్ చేస్తోన్న కుట్రపూరిత చర్యలన్నీ బెడిసికొడుతున్నాయి.

ఈ విషయాలను తెలుపుతూ అమెరికాలోని రాజకీయ రంగ విశ్లేషకుడు గోర్డన్‌ జీ చాంగ్‌. ‘ది కమింగ్‌ కొలాప్స్‌ ఆఫ్‌ చైనా’ అనే పుస్తకంలో రాసిన పలు విషయాలను ‘న్యూస్‌వీక్‌’ ప్రచురించింది. భారత్‌పై చైనా కనబర్చుతోన్న వైఖరికి కుట్ర పన్నింది షీ జిన్‌పింగేనని అందులో పేర్కొన్నారు. ఇటీవల తూర్పు లడఖ్‌ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంట జరిగిన అతిక్రమణలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పారు.

జిన్‌పింగ్‌ ఒత్తిడి వల్లే ఆ దేశ ఆర్మీ భారత భూభాగాలలోకి చొచ్చుకొస్తూ ఎన్నో ఎదురుదెబ్బలు తిందని చెప్పారు. భారత ఆర్మీ ఊహించని విధంగా కుట్రలను తిప్పికొడుతుండడంతో జిన్‌పింగ్‌ పరువు దక్కించుకొనేందుకు త్వరలోనే మరో భారీ అతిక్రమణకు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు.

చైనాపై ప్రతిదాడికి భారత్‌ వెనుకాడడం లేదని వివరించారు. కొన్నినెలల క్రితం గల్వాన్‌లో ఈ క్రమంలో భారత్ సైనికులు 20 మంది, చైనా సైనికులు 43 మంది మృతి చెందారని గుర్తుచేశారు. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో భారత్‌ కీలక పర్వత ప్రాంతాల్ని స్వాధీనం చేసుకోవడంతో చైనా ఖంగుతిన్నట్టు చెప్పారు. ఏది ఏమైనా ఈ రెండు దేశాల సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares