మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం..సీపీటీవీ ఫుటేజీ విడుదల: కాపు గాసి మరీ: చంపడానికే ప్లాన్

మచిలీపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రవాణాశాఖ మంత్రి పేర్ని నానిపై చోటు చేసుకున్న హత్యయాత్నానికి సంబంధించిన వీడియోను కృష్ణా జిల్లా పోలీసులు విడుదల చేశారు. మంత్రి నివాసం వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్దయిన వీడియో ఫుటేజీ అది. ఇంటి గేటు బయట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అనుచరుల కోలాహలం మధ్యే.. నిందితుడు నాగేశ్వరరావు ఈ దాడికి పాల్పడటం వీడియోలో రికార్డయింది.

భవన నిర్మాణ పనిముట్టు తాపీతో మంత్రిని పొడవటం, దాన్ని చూసిన వెంటనే అనుచరులు అతన్ని అడ్డుకోవడం కనిపించింది.కిందటి నెల 29వ తేదీన పేర్ని నాని తల్లి పెద్ద కర్మ నాడు మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పెద్దకర్మ నాడు పూజాదికాలను ముగించుకుని, భోజనాల కోసం బయలుదేరిన ఆయన గేటు వద్ద పార్టీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతూ ఉండగా.. ఒంటరిగా వచ్చిన నాగేశ్వర రావు ఆయనపై దాడి చేశాడు.

కాషాయరంగు చొక్కా ధరించిన నాగేశ్వర రావు తన జేబులో నుంచి తాపీని తీసి పేర్ని నానిని పొడవటం ఇందులో రికార్డయింది. మంత్రి గానీ, నాగేశ్వర రావు గానీ పూర్తిస్థాయిలో ఈ వీడియోలో లేరు. నాగేశ్వర రావు జేబులో నుంచి తాపీని తీసి ఒక పోటు పొడవటం.. దాన్ని గమనించిన వెంటనే అనుచరులు అతని వైపు దూసుకెళ్లడాన్ని ఈ వీడియోలో కనిపిస్తోంది. తొలిసారి పొడిచిన పోటు మంత్రి.. బెల్టుకు తగలడం వల్ల ఆయనకు ఎలాంటి గాయం కాలేదు. రెండోసారి పొడవడానికి ప్రయత్నించగా.. అనుచరులు అడ్డుకున్నారు.

ఈ ఘటనలో తనకేమీ కాలేదని పేర్ని నాని ఇదివరకే స్పష్టం చేశారు. తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. పేర్ని నానిని నిందితుడు నాగేశ్వర రావు హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఇంటికి చేరుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మర్డర్ మోటివ్ స్పష్టమౌతోందని తెలిపారు. ఉద్దేశపూరకంగానే ఈ దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. పేర్ని నానిపై చోటు చేసుకున్న హత్యాయత్నం కాకతాళీయంగానో.. లేదా ప్రమాదంగానో భావించట్లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares