మత కల్లోలాలకు చంద్రబాబు తపన- దేవాలయ ఘటనలు టీడీపీ పనే – బొత్స కామెంట్స్…

ఏపీలోని దేవాలయాల్లో తాజాగా చోటుచేసుకుంటున్న ఘటనల వెనుక విపక్ష టీడీపీ కార్యకర్తలే ఉన్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మతకల్లోలాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు తపన పడుతున్నారని బొత్స విమర్శించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి వ్యవస్ధని అస్తవ్యస్తం చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.
రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలు టీడీపీ అండతో ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్నవేనని మంత్రి బొత్స సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై కేసులు పెట్టి కక్ష తీర్చుకునే రాక్షస మనస్తత్వాలు చంద్రబాబుకు ఉంటాయే తప్పా తమకు ఉండవన్నారు.
చంద్రబాబు చేస్తున్న ఆందోళనతో రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ సంప్రదాయబద్ధంగా, భక్తిభావంతో శ్రీవారి సేవలో పాల్గొన్నారో రాష్టమంతా చూసిందని బొత్స తెలిపారు. చంద్రబాబువి మాత్రం ఫ్యాబ్రికేటెడ్ బుద్ధులన్నారు.
జగన్ ఏం పని చేసినా నిశ్చలంగా, మనస్ఫూర్తిగా, రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆలోచించి చేస్తారన్నారు.
విశాఖను పాలనా రాజధాని చేస్తామంటే విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలపై బొత్స మండిపడ్డారు. విశాఖ ప్రజలపై చంద్రబాబుకు ఎందుకంత ద్వేషమన్నారు. విశాఖ వచ్చే పెట్టుబడులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. వైఎస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు జగన్ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగకూడదని చంద్రబాబు కోరుకుంటున్నారా అని బొత్స ప్రశ్నించారు. గతంలో అధికారం అడ్డుపెట్టుకుని దోచుకుతిన్నారని, తప్పుచేసినా వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. టీడీపీ హయాంలో పంచభూతాలు పంచుకుతిన్నారని బొత్స గుర్తుచేశారు. తప్పులు చేయకపోతే స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారని
టీడీపీ నేతలను బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.