ముంబై చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన రాజస్థాన్!!

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జోరు కొనసాగిస్తోంది. మరో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి.. రాజస్థాన్ రాయల్స్‌పై 57 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 18.1 ఓవర్లలో పరుగులే చేసి ఆలౌటైంది. ముంబై బౌలర్లు బుమ్రా (4/20) సహా ట్రెంట్ బౌల్ట్ (2/26), జేమ్స్ పాటిన్సన్ (2/19) ధాటికి రాజస్థాన్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ (70; 44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం వృథా అయింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది.
ముంబై నిర్దేశించిన 194 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఆదిలోనే తడబడింది. ముంబై స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (0)ను ఔట్ చేశాడు. జైశ్వాల్.. కీపర్ క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్థాన్ పరుగుల ఖాతా తెరవకముందే తొలి వికెట్ కోల్పోయింది. స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (6) కూడా కీపర్ డికాక్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మూడో ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ మరో వికెట్ తీసి రాజస్థాన్‌ను కోలుకొని దెబ్బకొట్టాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్ (0)ను ఔట్ చేశాడు. దీంతో మూడు ఓవర్లలోనే 12 పరుగులకు రాజస్థాన్ మూడు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది.
ఈ సమయంలో ఓపెనర్ జోస్ బట్లర్, మహిపాల్ లామ్రోర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదు ఓవర్ల పాటు ఈ ఇద్దరు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. బట్లర్ ధాటిగా ఆడగా.. లామ్రోర్ ఆచితూచి ఆడాడు. బట్లర్ రెండు ఫోర్లు బాది ఊపులోకి వచ్చాడు. ఈ దశలో లామ్రోర్ (11) వికెట్ చేజార్చుకున్నాడు. స్పిన్నర్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో అంకుల్ రాయ్ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు బట్లర్ ఒంటరి పోరాటం చేశాడు. 44 బంతుల్లో 70 పరుగులు చేశాడు. పోరాడుతున్న బట్లర్‌ను 14వ ఓవర్లో పాటిన్సన్ ఔట్ చేయడంతో రాజస్థాన్ ఆశలు వదులుకుంది. ఆ తర్వాత రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాటపట్టారు. ఆఖర్లో ఆర్చర్ (24; 11 బంతుల్లో, 3×4, 1×6) చేసిన పరుగులు ఓటమి అంతరాన్ని తగ్గించింది. ముంబై బౌలర్లలో బుమ్రా (4/20) రాణించాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఆది నుంచే ఓపెనర్లు రోహిత్ శర్మ (35; 23 బంతుల్లో, 2×4, 3×6), క్వింటన్ డికాక్ (23; 15 బంతుల్లో, 3×4,1×6) బౌండరీల మోత మోగించారు. వీరిద్దరు కలిసి మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే తొలి మ్యాచ్ ఆడుతున్న కార్తిక్ త్యాగి (1/36) 5వ ఓవర్లో డికాక్‌ను బోల్తా కొట్టించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.