ముఖ్యమంత్రి జగన్తో ప్రముఖ నటుడు అలీ భేటీ..

కమెడియన్ అలీ ప్రస్తుతం సినిమాలతో పాటు రియాలిటీ షోలతో బిజీగా ఉన్నాడు. ఈయన ఫోకస్ అంతా ఇప్పుడు బుల్తితెరపైనే ఎక్కువగా ఉంది. అలీతో సరదాగాతో పాటు యమలీల 2 లాంటి సీరియల్ కూడా చేస్తున్నాడు. ఇంతకుముందు వచ్చినట్లు ఇప్పుడు వరస అవకాశాలు అలీకి రావడం లేదనేది వాస్తవమే. అయితే ఈయన ఇమేజ్ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ కొందరు దర్శకులు తమ సినిమాల్లో అలీ లేకపోతే ఏదో వెలితి అంటుంటారు. అలాంటి సినిమాలు చేసి.. మిగిలిన టైమ్ బుల్లితెరకు ఇచ్చేస్తున్నాడు ఈ నటుడు.
అయితే అప్పుడప్పుడూ సినిమాలతో పాటు రాజకీయాలు కూడా అంటున్నాడు ఈయన. గత ఎన్నికలకు ముందు ఈయన జగన్ పార్టీలో చేరడం.. అక్కడ తనకు మంత్రి పదవి కావాలని అడగడం అన్నీ జరిగిపోయాయి. అయితే చివరికి ఏం జరగలేదు అది వేరే విషయం. అయితే ఆ తర్వాత హర్ట్ అయి అలీ మళ్లీ పార్టీకి దూరంగా ఉన్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ తనకు జగన్ అంటే యిష్టం అంటున్నాడు ఈ నటుడు. ఆయన చేస్తున్న పనులు కూడా బాగున్నాయని గతంలోనే పొగిడాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని అలీ కలిసాడు. ఈ భేటితో మళ్లీ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఈయనకు వైసిపిలో ఏదైనా బాధ్యత ఇస్తున్నాడా లేదంటే పదవి ఆఫర్ చేస్తున్నాడా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఈ సందర్భంలో హాస్య నటుడు అలీ వెళ్లి జగన్ను కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ భేటీ వెనక ఎలాంటి రాజకీయాలు లేవని.. కేవలం మర్యాద పూర్వకంగానే వెళ్లి జగన్ను అలీ కలిసాడని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
ఇందులో మరో ఉద్దేశం కానీ.. రాజకీయ కాంక్ష కానీ లేవంటున్నారు వాళ్లు. మరోవైపు అలీ కూడా తనకు జగన్ పనితీరు నచ్చిందని.. అందుకే మర్యాదపూర్వకంగానే కలిసానని చెప్తున్నాడు. కానీ లోలోపల మాత్రం ఏదో మ్యాటర్ ఉండే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఈ లోలోపల ఉన్న మ్యాటర్ ఏంటో త్వరలోనే బయటికి రానుంది. అప్పటి వరకు ఇది మర్యాద పూర్వక భేటీగానే ఉంటుంది.