మూడు రాజధానులు నమ్మక ద్రోహం : పవన్‌ కల్యాణ్


కాపులకు రిజర్వేషన్‌ ఇచ్చేది లేదని ఎన్నికలకు ముందే చెప్పినట్లుగా, మూడు రాజధానులపై కూడా ముందే ప్రకటన ఎందుకు చేయలేదని ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్‌ కల్యాణ్‌ సీఎం జగన్‌ను ప్రశ్నించినట్లు ఈనాడు కథనం ఇచ్చింది.

మూడు రాజధానుల విషయం ముందు చెప్పినట్లయితే ఎన్నికల్లో ప్రజలు తమ నిర్ణయం ఏంటో చెప్పేవారని పవన్‌ కల్యాణ్‌ అన్నట్లు ఈనాడు కథనం పేర్కొంది. మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడదీస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.

అమరావతి 29 గ్రామాల సమస్య కాదని, ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సమస్యని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగపరంగా అందులో జోక్యం చేసుకోలేమని చెబుతోంది తప్ప, అమరావతి రాజధానిగా కొనసాగించడానికే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతోందని ఆయన అన్నారు.

రాజధాని విషయంలో గత ప్రభుత్వాలు తప్పు చేస్తే సరిదిద్దాలి తప్ప, మార్చాలనుకోవడం సరికాదని, ఇలా మార్చుకుంటూ పోతే దానికి అంతే ఉండదని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించినట్లు ఈ కథనం వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares