రకుల్ ప్రీత్ కోర్టులో పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవే


బాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి రావడం దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు బాలీవుడ్‌లో కూడా కలకలం రేపింది. రియా చక్రవర్తిని ప్రశ్నించే సమయంలో 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయని, అందులో సారా ఆలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తోపాటై డిజైనర్ సైమొనీ పేర్లు కూడా మీడియా బయటపెట్టడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో తనపై మీడియాలో వస్తున్న కథనాలు, సోషల్ మీడియాలో వస్తున్న మెసేజ్‌పై ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. రకుల్ ప్రీత్ దాఖలు చేసిన పిటిషన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

డ్రగ్ రాకెట్‌లో రకుల్ ప్రీత్, సారా ఆలీ ఖాన్ పేర్లు
డ్రగ్ రాకెట్ కేసులో రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన సమయంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లను బయటపెట్టారు అని టైమ్స్ నౌ కథనాన్ని ప్రచురించింది. రియాకు సన్నిహితులైన రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్ పేర్లు కూడా ఉన్నాయనే వార్తను ప్రముఖంగా జాతీయ టెలివిజన్ ప్రసారం చేసింది.

డ్రగ్స్ రాకెట్‌ విచారణపై ఎన్సీబీ ధృవీకరణ
బాలీవుడ్ డ్రగ్ రాకెట్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీ ఖాన్ పేర్లు ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ధృవీకరించినట్టు మరో వార్తను ప్రసారం చేసింది. రకుల్, సారాతోపాటు పలువురు ప్రముఖులు తమ దృష్టిలో ఉన్నారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత కొందరికి సమన్లు జారీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేసినట్టు కథనంలో పేర్కొన్నారు.

మీడియా కథనాలను నియంత్రించండి
డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో తనపై మీడియాలో వస్తున్న కథనాలపై రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. తనపై వస్తున్న కథనాలను నియంత్రించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రియా చక్రవర్తితో సంబంధాలు కలుపుతూ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు వస్తున్నాయని ఆమె తన పిటిషన్ తెలిపిసట్టు సమాచారం.

ఢిల్లీ హైకోర్టు స్పందిస్తూ..
రకుల్ ప్రీత్ సింగ్ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ నవీన్ చావ్లా స్పందిస్తూ.. కేంద్ర సమాచార, ప్రసారశాఖ, ప్రసార భారతీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేశారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేశారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0