రఘురామకృష్ణరాజుకు షాక్: పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపు

న్యూఢిల్లీ: సీబీఐ కేసు నేపథ్యంలో వైయస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ కొత్త ఛైర్మన్‌గా వైయస్సార్సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వచ్చాయని శుక్రవారం లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రుణాల ఎగవేత ఆరోపణల నేపథ్యంలో రఘురామకృష్ణరాజుపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని, నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్లు అభియోగాలు మోపింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కాగా, గత కొంత కాలంగా రఘురామకృష్ణరాజు సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కారణకు పాల్పడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవి కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. తప్పు జరిగిందని క్షమాపణలు చెబితే.. ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలున్నాయని రఘురామ వ్యాఖ్యానించారు.
న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దాడి చేయడం సరికాదన్నారు. న్యాయ వ్యవస్థపై దాడిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని, న్యాయవ్యవస్థపై దాడిని కోర్టు ధిక్కారణగా పరిగణించాలని రఘురామ అన్నారు న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పి జగన్ సీఎంగా కొనసాగాలని.. లేదంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. జగన్ తల్లి విజయలక్ష్మి లేదా ఆయన భార్య భారతి కూడా సీఎం కావచ్చని రఘురామ అన్నారు.

Shares