రాజధాని రైతుల కోసం గుంటూరు జైలు భరో … ఏపీలో ఉద్రిక్తత


రాజధాని రైతులకు బేడీలు వేయడం, వారిపై కేసులు పెట్టటంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పేనని టిడిపి నేతలు మండిపడుతున్నారు . ఇక మరోవైపు టిడిపి నేతలపై విరుచుకుపడుతున్నారు అధికార పార్టీ నేతలు. ఇదిలా ఉంటే రాజధాని అమరావతి ప్రాంత రైతులకు బేడీలు వేసి, కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ రాజధాని అమరావతి జేఏసీ ఈ రోజు ఛలో గుంటూరు జైలు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పోలీసుల అరెస్ట్ లతో ఈ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

గుంటూరు జైలు భరో … అమరావతి జేఏసీ నేతల ,టీడీపీ , సీపీఐ నాయకుల అరెస్ట్
గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి అనుమతి లేదని, ఎవరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పిన పోలీసులు, ఆందోళనను అడ్డుకోవటంలో భాగంగా అమరావతి జేఏసీ నేతలను, టిడిపి సిపిఐ నేతలను ఎక్కడికక్కడే గృహనిర్బంధం చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, అమరావతి జేఏసీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ జైలు భరో కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని చెప్తున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ అరెస్ట్ ల పర్వాలు కొనసాగిస్తున్నారు .

రాజధాని రైతులపై అట్రాసిటీ కేసులు .. చేతులకు బేడీలపై.. నిరసన
అమరావతి ప్రాంత రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం, వారికి సంకెళ్ళు వేసి జైలుకు తరలించడం పై రాజధాని జేఏసీ మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మూడోరోజు నిరసనలో భాగంగా నేడు గుంటూరు జిల్లా జైలు కు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అమరావతి ప్రాంతంలోని రైతులను హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాదు రాజధాని అమరావతి ప్రాంత రైతుల పోరాటానికి అండగా నిలుస్తున్న టిడిపి నేతలను సైతం అడ్డుకున్నారు.

జైలు వద్దకు వెళ్ళటానికి ప్రయత్నించిన జేఏసీ నేతలు … ఉద్రిక్తత .. అరెస్ట్ లు
ఇక మొత్తానికి నేడు గుంటూరు జైలు భరో కార్యక్రమంలో భాగంగా పలువురు జేఏసీ నేతలు గుంటూరు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు . రోడ్డుపై బైఠాయించిన రాజధాని రైతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు, రాజధాని రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు జేఏసీ కన్వీనర్ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జైలు వద్ద దాదాపు 150 మందిను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని తాడికొండ, నల్లపాడు పీఎస్‌లకు తరలించారు.

గుంటూరు జైలు భరోకు అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి
జైలు భరో కార్యక్రమం నేపధ్యంలో అలెర్ట్ అయిన గుంటూరు జిల్లా పోలీసులు గుంటూరు జైలు వద్ద భారీగా మోహరించారు . జిల్లా జైలు వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడారు. జైల్ భరోకు ఎలాంటి అనుమతి లేదని , కోవిడ్ నిబంధనల మేరకు ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశామని చెప్పారు. నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. 10 చోట్ల చెక్ పోస్టులు, 4 చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించిన ఆయన మొత్తం 3 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0