రాజ్యసభ వేదికగా వైసీపీ, టీడీపీ అమీతుమీ: ఎంపీ కనకమేడల

అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయంటూ ఆరోపణలను గుప్పిస్తోంది తెలుగుదేశం. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న దళితుల శిరోముండన ఘటనలు, ఇతర దాడుల ఉదంతాలను దేశం మొత్తం వినిపించే ప్రయత్నానికి దిగింది. దీనికోసం రాజ్యసభను వేదికగా చేసుకుంది. ఏపీలో తరచూ నమోదవుతోన్న ఈ దాడుల అంశంపై రాజ్యసభలో ప్రస్తావించబోతోంది. ఇప్పటిదాకా చోటు చేసుకున్న సంఘటనలను సభ దృష్టికి తీసుకుని రాబోతోంది.

దళితులపై దాడులు..
ఈ మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కొద్దిసేపటి కిందటే జీరో అవర్ నోటీస్ ఇచ్చారు. ఈ అంశంపై సభలో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం దళితులపై సంభవించిన దాడుల వివరాలను ఆయన జీరో అవర్ సందర్భంగా ప్రస్తావించనున్నారు. విశాఖపట్నం రూరల్ నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఉదంతం సహా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న దళిత యువకుల శిరోముండన ఉదంతాలను కనకమేడల ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శిరోముండన ఉదంతాలను సభలో..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో రాష్ట్రంలో దళితులపై దాడులు తీవ్రతరం అయ్యాయంటూ తెలుగుదేశం పార్టీ విమర్శలను గుప్పిస్తూ వస్తోంది. దళితులపై 60కి పైగా దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయనే అంశాన్ని టీడీపీ రాజ్యసభలో ప్రస్తావించబోతోంది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ప్రసాద్ అనే యువకుడికి ట్రైనీ ఎస్ఐ ఫిరోజ్‌ శిరోముండనం చేయడం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో దళిత యువకుడు ఓం ప్రతాప్‌ ఆత్మహత్య చేసుకోవడం వంటి అంశాలను కనకమేడల సభ దృష్టికి తీసుకుని రానున్నారు.

జీర్ అవర్ నోటీస్..
మద్యం ధరలను అమాంతంగా పెంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను దూషించిన ఓం ప్రతాప్ బలవన్మరణానికి పాల్పడటానికి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన అనుచరులే కారణమంటూ తెలుగుదేశం పార్టీ ఇదివరకు విమర్శలు చేసింది. ఆయా ఉదంతాలన్నింటినీ కనకమేడల రాజ్యసభలో వినిపించనున్నారు. ఈ మేరకు ఛైర్మన్‌ను తాను ఇచ్చిన జీరో అవర్ నోటీసులో వాటిని ఏకవాక్యం కింద ప్రస్తావించనున్నారు.

వైసీపీ కౌంటర్ అటాక్ ఎలా?
ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఉన్న ఏకైక సభ్యుడు ఆయనే. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ టీడీపీ నుంచే రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ.. పార్టీ ఓడిపోయిన తొలి రోజుల్లోనే వారు ఫిరాయించారు. భారతీయ జనతా పార్టీ కండువాను కప్పుకొన్నారు. జీరో అవర్ సందర్భంగా కనకమేడలకు వారంతా అండగా గళం విప్పుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అదే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి ఆరుమంది సభ్యుల బలం ఉంది. వైసీపీ సభ్యుల వాదన ఎలా ఉండబోతోందనేది చర్చనీయాంశమౌతోంది. కనకమేడల లేవనెత్తే అంశాలపై వైసీపీ సభ్యులు ఎలా కౌంటర్ అటాక్ ఇస్తారనేది కాస్సేపట్లో తేలిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares