రాయుడు లేని లోటు కనిపిస్తోంది.. అందుకే ఓటములు : ధోనీ

ఐపీఎల్ 2020 టోర్నీలో ఎపుడూ రికార్డులు బ్రేక్ చేస్తూ అన్ని జట్ల కంటే మెరుగైన స్థానంలో ఉండే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇపుడు వరుస ఓటములను ఎదుర్కొంటోంది. యూఏఈ గడ్డపై అన్ని జట్ల కంటే ముందుకు అడుగుపెట్టింది. కానీ, ఈ జట్టును కరోనా వైరస్ పగబట్టింది. ఫలితంగా 15 రోజుల పాటు తమకు కేటాయించిన హోటల్ గదులకే పరిమితమయ్యారు. ప్రాక్టీస్ కనుమరుగైంది. ఆ తర్వాత అరకొర ప్రాక్టీస్‌తో ప్రారంభ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు అద్భుతమైన ఆటతీరుతో ఈ మ్యాచ్‌లో సీఎస్కే విజయభేరీ మోగించింది.

ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లలో వరుసగా ఓడిపోయింది. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో 48 బంతుల్లో 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రాయుడు గాయం కారణంగా ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఈ వరుస ఓటములపై ధోనీ స్పందిస్తూ, తొలి మ్యాచ్‌లో ఇరగదీసిన అంబటి రాయుడు జట్టులో లేకపోవడం వల్లే ఓటమి పాలవుతున్నట్టు చెప్పాడు. తర్వాతి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని, ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

శుక్రవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత ధోనీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. రాయుడు లేకపోవడంతో జట్టులో సమతూకం దెబ్బతిందని, ఈ కారణంగానే చివరి రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలయ్యామన్నాడు. బ్యాటింగ్ విభాగంలో కసి తగ్గడం బాధగా ఉందన్నాడు.

ఆరంభంలో జోరు తగ్గడంతో బంతులు, పరుగుల మధ్య వ్యత్యాసం పెరిగి ఒత్తిడి పెరుగుతోందన్నాడు. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు అందుబాటులోకి వస్తాడని, దీంతో జట్టు సమతూకంలోకి వచ్చి పరిస్థితి మెరుగుపడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. రాయుడు కనుక అందుబాటులోకి వస్తే అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకు వీలుంటుందని ధోనీ చెప్పుకొచ్చాడు

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0